దర్శకుడు రాజమౌళి గొప్పోడు అని ఎవరు ఎందుకైనా అనొచ్చు. కానీ ఒక విషయంలో మాత్రం కచ్చితంగా గొప్పోడే. తన రేంజ్ ఎల్ కె జి లెవెల్ లో వుండగా తీసుకున్న అడ్వాన్స్ లను, అదే రేంజ్ డాక్టరేట్ లెవెల్ కు వెళ్లిన తరువాత కూడా హానర్ చేయడం..అదీ అసలు సిసలు గొప్ప విషయం.
తెలుగునాట చాలా మంది అగ్ర దర్శకులు చేయని పని ఇది. ఏదో విధంగా పాత కమిట్ మెంట్ లను వదల్చుకుందామని చూసేవారే. తీసుకున్న అడ్వాన్స్ ను, కాస్త వడ్డీ కలిపి వెనక్కు పడేసి తప్పించుకునేవారే.
కానీ రాజమౌళి అలా కాదు..డివివి దానయ్య అడ్వాన్స్ ను గుర్తుపెట్టుకుని మరీ సినిమా తీసి చెల్లు చేసాడు. అలా అని చెప్పి, సరదాగా ఓ చిన్న సినిమా తీసి సరిపెట్టలేదు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా తీసి ఇచ్చాడు. అప్పుడెప్పుడో దానయ్య వేసిన చిన్న విత్తనం కోట్లు కురిపించింది. అలాంటి మరో అడ్వాన్స్ నే కేఎల్ నారాయణ ఇచ్చింది. ఇప్పుడు దానిని కూడా హానర్ చేస్తున్నాడు.
కానీ ఇకపై రాజమౌళి దగ్గర మరే అడ్వాన్స్ లేదు. ఇకపై సినిమాలు అన్నీ తన స్వంత ప్రొడక్షన్ లేదా తన స్వంత టీమ్ తోనే చేసుకుంటారని తెలుస్తోంది. ఒక సినిమాను మాత్రం తన సన్నిహితుడు సాయి కొర్రపాటికి చేస్తారట. రాజమౌళికి మొదటి నుంచి అండగా, తోడుగా వుంటున్నారు సాయి కొర్రపాటి. అందుకే సరైన సినిమా ఒకటి చేస్తారట. ఆ విధంగా సాయి కొర్రపాటికి బలమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ తరువాత మాత్రం తన స్వంత ప్రొడక్షన్ లేదా, సాయి కొర్రపాటి సహకారంతో సినిమాలు చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎలాగూ టోటల్ ప్రొడక్షన్ టీమ్ అంతా తన ఇంట్లోనే వుంది. ఫండింగ్ కు లోటు లేదు. అలాంటపుడు వేరే నిర్మాతలకు వాటా ఎందుకు ఇవ్వడం?