రాజకీయ పార్టీ అన్నాక.. నిత్యం పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడం, ప్రభుత్వాలను విమర్శిస్తూ ఉండడం, అడపాదడపా ప్రజల్లోకి వెళ్లి వాళ్లకోసం పనిచేయడం, పనిచేస్తున్నట్టుగా కనిపించడం మాత్రమే కాదు కదా.. ఎన్నికల్లో పోటీచేయాలనే కోరిక కూడా ప్రతి పార్టీకి ఉంటుంది. కానీ చాలినంత బలం లేనప్పుడు పార్టీలు చతికిలపడుతుంటాయి. తమకు అండగా నిలిచి, కాస్త చేయూత ఇచ్చేవాళ్లు దొరికితే చెలరేగిపోగలమని అనుకుంటూ ఉంటాయి. ఏపీలో వామపక్షాలది అదే పరిస్థితి. వారికి చేయూత కావాలి.
ఒకటి కంటె ఎక్కువశాతం ఓటు బ్యాంకు వారికి రాష్ట్రంలో ఉండవచ్చు గాక.. కానీ ఒంటరిగా పోటీచేసి ఒక్కసీటునైనా గెలుచుకోగలిగే సత్తా లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. ఆ పాకులాటకు ‘జీవోనెం.1 మీద ఐక్యపోరాటం చేస్తాం’ అనే ముసుగు తొడుక్కుంటున్నారు.
వామపక్షాలకు ఎన్నికల్లో పోటీచేయాలని ఉంటుంది. కానీ బలం లేదు. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశమేఇవ్వరు. తాను ఎప్పటికైనా సొంతంగా, ఒంటరిగా మాత్రమే పోటీచేస్తానని అంటారు. అక్కడ డోర్స్ క్లోజ్ అయినట్టే. ఇక చంద్రబాబునాయుడు ఒక్కడే దిక్కు. అందుకే ఆయనను కలిసి.. జీవో నెం.1 మీద పోరాటానికి మద్దతు ప్రకటించే మిష మీద.. మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ.. అటు చంద్రబాబునాయుడు బిజెపి ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. బిజెపి ఆయనను దగ్గరకు రానివ్వడం లేదు. బిజెపి తన కూటమిలోకి రాకపోవచ్చు గానీ.. అలాగని బిజెపిని దూషించే, మోడీ మీద మళ్లీ నిందలు వేసే ధైర్యం చంద్రబాబుకు లేదు. అదే సమయంలో, నిత్యం బిజెపి మీద వార్ ప్రకటించే వామపక్షాలను దగ్గరకు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. లెఫ్ట్ పార్టీలను జట్టులో కలుపుకుంటే ఎక్కడ మోడీ ఆగ్రహిస్తారో అని ఆయనకు భయం.
అయితే లెఫ్ట్ పార్టీలకు భారాస రూపంలో ఇంకో ఆప్షన్ ఉంది. భారాస ఇతర రాష్ట్రాల్లో పొత్తుల మీదనే బతికే పార్టీ కాబట్టి.. లెఫ్ట్ ను జట్టులో కలుపుకోవడానికి ఉత్సాహపడుతుంది. కానీ దాని వలన వామపక్షాలకు ఉపయోగం లేదు. ఏదో పోటీచేశాం అనిపించుకోవాల్సిందే తప్ప.. సీట్లు నెగ్గుతాం అనే గ్యారంటీ లేదు. ఇలాంటి ఇరకాటంలో ఎందుకైనా మంచిదని.. చంద్రబాబునాయుడును ప్రసన్నం చేసుకోవడానికి… జీవోనెం.1 పై పోరాటాన్ని అడ్డు పెట్టుకుని వామపక్షాలు పాట్లు పడుతున్నట్టుగా కనిపిస్తోంది.