ఏదో రకంగా మెగా ఫ్యామిలీ మెప్పు పొంది, సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలనే తాపత్రయం కొంత మంది నటుల్లో కనిపిస్తోంది. వెండితెరను నమ్ముకున్న వచ్చిన వాళ్లు వేషాల కోసం ఏవేవో తిప్పలు పడుతుంటారు. అయితే టాలీవుడ్లో రాజ్యమేలుతున్న మెగాబ్రదర్స్ మెప్పుకోసం… వారి రాజకీయ ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడం వెనుక వారి తాపత్రయాన్ని అర్థం చేసుకుని సానుభూతి చూపడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
తాజాగా మెగా బ్రదర్స్ కోసం వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి ఆర్కే రోజాకు ట్విటర్ వేదికగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ ట్వీట్ బూమరాంగ్ అయ్యింది. చివరికి బ్రహ్మాజీపై ట్రోలింగ్‌కు ఆయన ట్వీటే కారణమైంది. ఇటీవల హైపర్ ఆది శ్రీకాకుళం సభలో పవన్‌ను మెప్పించే రెండు మాటలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలున్నారని, వాళ్లకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమాల్లో నటించే అవకాశాలు రావన్నారు. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అనే భయంతోనే చిన్న ఆర్టిస్ట్‌లు వాళ్లకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అంతే తప్ప వారిపై ప్రేమతో కాదని విమర్శించారు.
మంత్రి రోజా విమర్శలపై ఎదురు దాడి చేసేందుకు నటుడు బ్రహ్మాజీ ఉత్సాహం చూపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అదేంటంటే… ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ campain చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్ లే కదా.. అంత భయపడతారెందుకు’ అని రోజాని ఉద్దేశించి ఘాటు ట్వీట్ చేశారు. ‘బ్రహ్మాజీ… మీరు పరమ భక్తులని మెగా ఫ్యామిలీకీ ఈ ట్వీట్ చూసిన తర్వాతే తెలిసింది. ఇక మీదట campain చెయ్యాలని, పార్టీలో చేరాలని అడుగుతారులే. చిన్న ఆర్టిస్టువే కానీ, బతకనేర్చిన వాడివని ఇప్పుడే అర్థమైంది’ అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ఆయన్ను ఆడుకుంటున్నారు.
‘కోటి విద్యలు కూటి కోసమే. మెగా ఫ్యామిలీపై భక్తి, రోజాపై విరక్తి ట్వీట్లన్నీ వేషాల కోసమే. బ్రహ్మాజీ రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైప్‌లోనూ నువ్వు మంచినటుడవని ఈ ట్వీట్ ద్వారా తెలిసింది’ అంటూ దెప్పి పొడుస్తున్నారు.