ముందుగా జులై 30 రిలీజ్ అన్నారు. ఆ తర్వాత దీపావళి స్పెషల్ అన్నారు, తాజాగా డిసెంబర్ 3 డేట్ ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు మరోసారి వాయిదాపడింది గని మూవీ. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను ఇప్పుడు డిసెంబర్ 24కు వాయిదా వేశారు. సినిమా టీజర్ రిలీజ్ చేసి మరీ విడుదల తేదీ ప్రకటించిన యూనిట్, క్రిస్మస్ కానుకగా వస్తున్నట్టు ప్రకటించారు.
క్రిస్మస్ కు ఆల్రెడీ శ్యామ్ సింగరాయ్ లైన్లో ఉంది. అంతకంటే వారం ముందు పుష్ప సినిమా వస్తోంది. ప్రస్తుతానికైతే డిసెంబర్ 17 తేదీకి పుష్ప యూనిట్ కట్టుబడి ఉంది. సో.. గని మూవీకి కాంపిటిషన్ గట్టిగానే ఉంది. మరి ఈ పోటీలో వస్తారా లేక సినిమాను మరోసారి వాయిదా వేస్తారా అనేది చూడాలి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, గని మూవీ ఈసారి వాయిదా పడే అవకాశాల్లేవు. ఎందుకంటే ఈ తేదీ దాటితే మరో 2 నెలల వరకు సినిమాకు డేట్ దొరకని పరిస్థితి.
టీజర్ రిలీజ్ చేసి మరీ డేట్ ఎనౌన్స్ చేశారంటే, ఈసారి క్రిస్మస్ కు గని రాక గ్యారెంటీ అనుకోవచ్చు. ఇక టీజర్ విషయానికొస్తే.. బాక్సింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం అర్థమౌతోంది. టీజర్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. బాక్సర్ లుక్ లో, సిక్స్ ప్యాక్ బాడీతో వరుణ్ తేజ్ కరెక్ట్ గా సరిపోయాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ తీసుకొచ్చింది.
సయీ మంజ్రేకర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్దబ్బాయ్ అల్లు బాబి నిర్మిస్తున్నాడు.