హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద, కేసీఆర్ కు జరిగిన ఘోర అవమానం మీద ఇంకా చర్చోపచర్చలు, విశ్లేషణలు ఆగడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ అభిమానులు, ఈటల అభిమానులు రకరకాలుగా అనలైజ్ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను కేసీఆర్ పెద్దగా పట్టించుకోకుండా మామూలుగా ప్రచారం చేసుకుంటూ వెళితే బాగుండేది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు చాలా చిన్న విషయమని కేటీఆర్ అన్నాడు గానీ కేసీఆర్ మాత్రం కురుక్షేత్ర యుద్ధం లెవెల్లో తీసుకొని జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కల్పించారు. తాడోపేడో, చావోరేవో అన్నట్లుగా వ్యవహరించారు. చివరకు ఫలితం వ్యతిరేకంగా రావడంతో ఆయన పరువు పోయినట్లుగా ఉంది.
నిజానికి ఈ ఒక్క ఉప ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన రాజకీయంగా టీఆర్ఎస్ కు వచ్చే నష్టమంటూ ఏమీ లేదు. బీజేపీ ప్రచారం చేస్తున్నట్లు టీఆర్ఎస్ పతనమేమీ ప్రారంభం కాలేదు. ఇక ఎక్కువమంది అభిప్రాయపడిన విషయమేమిటంటే ….ఈటలకు సొంత ఇమేజ్ ఉంది కాబట్టి, బీజేపీలో చేరకుండా ఒంటరిగా పోటీ చేసినా గెలిచేవాడని చెబుతున్నారు.
ఈటల బీజేపీ తరపున పోటీ చేయడంతో ఆ పార్టీ తురుంఖాన్ లా ఫోజులు కొడుతోందని బీజేపీ వ్యతిరేకులు చెబుతున్నారు. గెలుపు క్రెడిట్ ఈటలకే దక్కుతుందని, బీజేపీకి కాదని అంటున్నారు. ఏదో ఒక పార్టీ అండ లేకుండా ఒంటరిగా పోటీ చేస్త్తే గెలవలేనేమోనని ఈటల అనవసరంగా భయపడ్డాడని చెబుతున్నారు.
వాస్తవానికి ఈటల రాజకీయ నేపథ్యం చూస్తే విద్యార్థిగా ఉన్నప్పుడు తీవ్రవాద వామపక్ష రాజకీయాల్లో ఉన్నాడు. తెలంగాణా ఉద్యమంలో టీఆర్ఎస్ తరపున పోరాడాడు. సిద్ధాంత పరంగా చూసినా, రాజకీయాలపరంగా చూసినా ఈటలకు బీజేపీకి లింక్ ఉండకూడదు. కానీ రాజకీయ అవసరాలు ఈటలను బీజేపీలో చేరేలా చేశాయి. కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం బీజేపీని ఒక ఆయుధంగా వాడుకున్నాడుగానీ ఆయనకు ఆ పార్టీ పట్ల అంతగా కమిట్మెంట్ ఉండదని కొందరు అంటున్నారు.
సేమ్ …బీజేపీకి కూడా ఇదే అవసరం. టీఆర్ఎస్ ను ఓడించాలంటే బలమైన అభ్యర్థి కావాలి కాబట్టి ఈటలను పట్టేసింది. ఇలా పరస్పర రాజకీయ అవసరాలు ఈటల – బీజేపీ కలవడానికి దోహదం చేశాయి. ఈటలకు బీజేపీ పట్ల నిబద్ధత ఉండదని చెప్పేవారు ఒక విషయం చెబుతున్నారు. ఈటల తన ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ జైశ్రీరామ్ అనలేదని చెబుతున్నారు.
జైశ్రీరామ్ అనేవాడే బీజేపీ నాయకుడా ? ఒరిజనల్ బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అంటారేమోగాని రాజకీయ అవసరాల కోసం పార్టీలో చేరే వలస నాయకులు ఎందుకంటారు ? వాళ్ళు అనకపోయినా బీజేపీ నాయకులు ఫీలవరు. వాళ్ళవీ రాజకీయ అవసరాలే కదా. ఈటల మాత్రం బీజేపీలో చేరడం తన అదృష్టమన్నాడు. వాస్తవానికి గెలుపు క్రెడిట్ ఈటలదే అనుకున్నా బీజేపీ కారణంగా ఆయనకు అంగబలం, అర్ధబలం లభించాయి .