‘రచ్చ చేయడమే’ : చంద్రబాబు పాచి వ్యూహం!

కుప్పం మునిసిపాలిటీలో సోమవారం పోలింగ్ జరగనుంది. కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబునాయుడు సోమవారం కుప్పం వస్తున్నారు. సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. తన సొంత నియోజకవర్గంలో ఉన్న ఏకైక మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతోంటే.. నామమాత్రంగా…

కుప్పం మునిసిపాలిటీలో సోమవారం పోలింగ్ జరగనుంది. కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబునాయుడు సోమవారం కుప్పం వస్తున్నారు. సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. తన సొంత నియోజకవర్గంలో ఉన్న ఏకైక మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతోంటే.. నామమాత్రంగా ఒకసారి వచ్చి వెళ్లి, తర్వాత ప్రచారం గురించి అస్సలు పట్టించుకోని చంద్రబాబునాయుడు- పోలింగ్ నాడు ఎందుకు వస్తున్నట్టు? అనేది పెద్ద ప్రశ్న.

కుప్పంలో చంద్రబాబునాయుడు అధికార పార్టీ మీద ఆరోపణలు చేయడానికి సిద్ధపడే కుప్పం వస్తున్నట్టుగా కనిపిస్తోంది. సాయంత్రంలోగా ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని, ఈ ఎన్నికను రద్దు చేయాలని, పారదర్శకంగా వేరే అధికార్లతో మళ్లీ నిర్వహించాలని ఆందోళన చేయడానికి డిమాండ్లు వినిపించడానికి వ్యూహాత్మకంగా చంద్రబాబునాయుడు పోలింగ్ నాడు కుప్పంకు వస్తున్నారు. 

ఓటమి తప్పదని అర్థమైపోయినప్పుడు- ఆ ఓటమి తమ చేతగాని తనం వల్ల కాదని, ఎదుటివారు అక్రమాలకు అరాచకాలకు పాల్పడడం వల్లనే గెలిచారని ఆరోపణలు రువ్వడం అనేది ఒక టెక్నిక్! చంద్రబాబునాయుడు విషయంలో చాలా పాత, పాచిపోయిన టెక్నిక్ అది. నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. రాజకీయ వ్యూహాలను కూడా అదే పాత వ్యూహాలను అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన చాణక్య తెలివితేటలు ఒకప్పటి రాజకీయాలకు సరిపోయాయని.. ఇప్పుడు పనికి రావడం లేదని అందరూ అంటున్నారు. 

కుప్పంలో చంద్రబాబునాయుడు ప్రభ, ప్రజాదరణ సన్నిగిల్లుతున్న మాట వాస్తవం. అయితే ఆ విషయాన్ని ఆయన ఒప్పుకోవడం లేదు. గత ఎన్నికల్లో బాగా తగ్గిన మెజారిటీ తర్వాత.. ఈ మునిసిపల్ ఎన్నిక ఫలితాలు.. ఆయనకు హెచ్చరిక లాంటి ఫలితాన్ని అందిస్తాయనే అంతా అనుకుంటున్నారు. 

అలాంటి సంకేతాలు ముందునుంచి ఉన్నప్పటికీ.. చంద్రబాబునాయుడు ఈ ఎన్నిక గురించి పట్టించుకున్నది మాత్రం లేదు. ఎలాంటి అదనపు హోదాలు బాధ్యతలు పని ఒత్తిడి లేకపోయినప్పటికీ.. కేవలం ఎమ్మెల్యే మాత్రమే అయినప్పటికీ ఆయన కుప్పం ఎన్నికల ప్రచారానికి సమయం కేటాయించ లేదు. చివరి దశలో లోకేష్ వచ్చి హడావుడి చేశారు. 

ఎన్నికల ప్రచారాన్ని కూడా పట్టించుకోని నాయకుడు.. పోలింగ్ నాడు రావడమే చిత్రంగా ఉంది. పోలింగ్ నాటి సంఘటనల్ని భూతద్దంలో చూపించడానికి.. గొడవలు జరుగుతున్నాయని, అరాచకాలు జరుగుతున్నాయని పెద్దఎత్తున గోలచేసి.. రాద్ధాంతం చేసి ఓటమి దక్కినా సరే.. తనకు మైలేజీ తెచ్చుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. 

ఎన్నికల మీద శ్రద్ధ ఉండే నాయకుడైతే ముందే ప్రచారానికే వచ్చి ఉండేవాడు కదా అని స్థానికులు అంటున్నారు. పోలింగ్ నాడు రావడం అనేది కేవలం రాజకీయ ఎత్తుగడ, వ్యూహం మాత్రమే అని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు.