గేదె పాలు ఇవ్వడం లేదని పోలీస్ కంప్లయింట్

మధ్యప్రదేశ్ లో వింత ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా తన గేదె పాలు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. Advertisement…

మధ్యప్రదేశ్ లో వింత ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా తన గేదె పాలు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.

భిండ్ జిల్లాకు చెందిన బాబూలాల్ జాతవ్ అనే వ్యక్తి నయగావ్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. తన గేదె పాలు ఇవ్వడం లేదని కంప్లయింట్ ఇచ్చాడు. ఎవరో తన గేదెకు చేతబడి చేసి ఉంటారని, అందుకే అది పాలు ఇవ్వడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫిర్యాదు ఇచ్చిన కొన్ని గంటలకు తిరిగి తన గేదెతో పాటు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు బాబూలాల్. తనకు ఏకైక ఆధారం తన గేదె మాత్రమేనని, ఎలాగైనా అది పాలిచ్చేలా చూడాలని పోలీసుల్ని వేడుకున్నాడు. ఏకంగా ఈ విషయం డీఎస్పీ అరవింద్ షా వరకు వెళ్లింది.

ప్రత్యేకమైన కేసుగా దీన్ని పరిగణించిన డీఎస్పీ, పశువైద్యుల సహకారం తీసుకొని ఈ కేసును క్లోజ్ చేయాలని లోకల్ పోలీస్ కు ఆదేశాలు జారీచేశారు. వెంటనే రంగంలోకి దిగిన నయగావ్ పోలీసులు.. పశువైద్యుడితో గేదెకు ట్రీట్ మెంట్ ఇప్పించారు. చేతబడి లాంటివేం జరగలేదని స్పష్టంచేశారు.

ఆదివారం మధ్యాహ్నం మరోసారి బాబూలాల్ తో పాటు అతడి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. గేదె పాలు ఇచ్చిందంటూ, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.