తెలుగుదేశం ఎపుడు అధికారంలోకి వచ్చింది అని గట్టిగా ఎవరూ అడగమాకండి. కంగారు కూడా పడాల్సినది లేదు. ఇంకా ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది. కానీ తమ్ముళ్లకు ఆత్రుత చూస్తే ఒక స్థాయిలో ఉంది. జగన్ సీఎం గా కుర్చీ ఎక్కినది లగాయితూ దిగిపో అంటూ గొడవ మొదలెట్టిన తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊరుకుంటారా.
ఎవరి ఆరాటాన్ని వారు అలా బయటపెట్టేసుకుంటారు. గెలుపు ఖాయమని తాముగానే కమిట్ అయిపోతూ తమ శాఖలను కూడా చంద్రబాబు ప్రమేయం లేకుండానే ఎంచేసుకుంటున్నారు. రేపటి హోం మంత్రిని నేనే అంటున్నారు విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు. అది కూడా మరో తొమ్మిది నెలల్లోనేనట.
ఏపీలో ఎన్నికలు 2024 మే లో కానీ జరగవు. అంటే ఇప్పటికి 16 నెలల పై దాటి సమయం ఉంది. కానీ తొమ్మిది నెలల్లో నేనే హోం మినిస్టర్ అని అయ్యన్న హడావుడి చేయడం చూస్తూంటే ఏమనుకోవాలో. తాను హోం మంత్రి అయితే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో అమలు చేసి చూపిస్తారుట.
ఏపీలో ప్రస్తుతం శాంతిభద్రతలు సరిగ్గా లేవని ఒక బండ వేసిన అయ్యన్న ఎప్పటిమాదిరిగానే పోలీసుల మీద పడ్డారు. వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని నిందిస్తున్నారు. అందువల్ల తాను హోం మంత్రి అయి తీరాల్సిందే అని అయ్యన్న సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు.
ఈయనకు ముందు ఉత్తరాంధ్రాకే చెందిన మరోకాయన అచ్చెన్నాయుడు కూడా కాబోయే హోం మంత్రిని తానే అని చాలా సీరియస్ గా చెప్పినట్లు గుర్తు. ఆయన చాలా కాలం ముందే చెప్పడమే కాదు చంద్రబాబుని అడిగి మరీ ఈ శాఖనే తీసుకుంటాను అని పట్టుదలగా చెప్పారు.
ఈ ఇద్దరే అనుకుంటే పొరపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతీ నేతా పోలీసుల మీద విరుచుకుపడిన సందర్భాలలో తామే కాబోయే హోం మంత్రులమని అంటూ వచ్చారు. ఈ లెక్కన అయ్యన లిస్ట్ లో ఎన్నో వారే తమ్ముళ్ళే కూడి మరీ చెప్పాల్సి ఉంటుంది. అయినా ముందు ఎన్నికలు జరగాలి. తెలుగుదేశం గెలవాలి. చంద్రబాబు మంత్రిగా తీసుకున్నపుడు కదా ఈ శాఖల ముచ్చట అని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. అధికారంలో వచ్చేంత సీన్ లేదు కానీ శాఖలు అపుడే పంచుకుంటారా అని సెటైర్లు వేస్తున్నారు.