ఏ కథలో అయినా హీరో అందంగానే వుండాలి..విలన్ వికారంగానే కనిపించాలి. రామాయణం నుంచి వస్తున్న పద్దతి ఇది అంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. వీరసింహారెడ్డి సక్సెస్ నేపథ్యంలో ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇంటర్వూ ఇచ్చారు. వీరసింహారెడ్డిలో విలన్లు ఇద్దరూ అంత భయంకరంగా వుండడం వివరణ ఇస్తూ ఎక్కడో ఒకటి రెండు కథలకు మినహా మరే కథలకు విలన్ అందంగా వుండడం అన్న పాయింట్ సెట్ కాదన్నారు.
సినిమాలో పొలిటికల్ టచ్ వున్న సీన్లు, డైలాగులు వుండడం పై వివరణ ఇస్తూ, ఏ ఒక్క సీన్ కానీ డైలాగు కానీ కావాలని చొప్పించలేదని, కథలో భాగంగా వచ్చినవే అని గోపీచంద్ వివరించారు. ఇరికించినట్లు, అతికించినట్లు కనిపించే ఒక్క డైలాగు కానీ సీన్ కానీ సినిమాలో లేదన్నారు. అలాగే సినిమాలో రేప్ సీన్ గురించి వివరిస్తూ, అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని, అంటే ముఫై ఏళ్ల కిందటి సంగతి అని, అప్పటి పరిస్థితులు అవి అని చెప్పారు. ఒక బలమైన రియాక్షన్ రావాలంటే ఆమేరకు వుండే సంఘటన అవసరం అవుతుందన్నారు.
బాలయ్య సినిమాకు వేరే రేసీ స్క్రీన్ ప్లే తో కూడిన ఓ కథను అనుకున్నామని, కానీ అఖండ తరువాత కచ్చితంగా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అవసరం క్లారిటీగా కనిపించిందని, దాంతో ఆ కథను పక్కన పెట్టి వేరే లైన్ చెప్పా అన్నారు. అది బాలయ్యకు నచ్చడంతో దాన్ని డెవలప్ చేసామన్నారు. శృతిహాసన్ తన కుటుంబంలో ఒకరు అనేంత అనుబంధం వుందని గోపీచంద్ మలినేని చెప్పారు.
సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్,చనిపోయే సీన్ రెండూ తనకు ఎంతో నచ్చిన సన్నివేశాలు అన్నారు. ఈ సినిమాలో రెండు రిస్క్ లు చేసానని, చెల్లెలి కోసం ప్రాణం ఇచ్చే సినిమాలే ఇప్పటి వరకు వచ్చాయని, అలాంటిది చెల్లి ప్రాణం తీసే యాంటీ సెంటిమెంట్ ఇందులో వుందని వివరించారు. అలాగే ప్రతి సినిమాలో సీనియర్ పాత్ర విశ్రాంతి తరువాత ఎంటర్ అవుతుందని, ఈ సినిమాలో విశ్రాంతికి ముగిసిపోతుందని, అది కూడా రిస్కే అని అన్నారు.
తీసుకున్న రిస్క్ లు ఫలించాయని, జనం సినిమాను ఆదరిస్తున్నారని గోపీచంద్ మలినేని ఇంటర్వూ ముగించారు.