బాక్సాఫీస్ కాకుండా… ఓటీటీ రేటు రూ.వంద‌కోట్లు!

బాలీవుడ్ సినిమా సూర్య‌వంశీ విడుద‌ల‌కు చాలా స‌మ‌య‌మే తీసుకున్నా.. డ‌బ్బులు రాబ‌ట్టుకోవ‌డంలో మాత్రం స‌త్తా చూపిస్తూ ఉంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ కు ముందే ఈ సినిమా హ‌డావుడి మొద‌లైంది. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు…

బాలీవుడ్ సినిమా సూర్య‌వంశీ విడుద‌ల‌కు చాలా స‌మ‌య‌మే తీసుకున్నా.. డ‌బ్బులు రాబ‌ట్టుకోవ‌డంలో మాత్రం స‌త్తా చూపిస్తూ ఉంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ కు ముందే ఈ సినిమా హ‌డావుడి మొద‌లైంది. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు అనుకూలంగా లేని నేప‌థ్యంలో వార్త‌ల్లోంచి క‌నుమ‌రుగైంది. ఓటీటీ విడుద‌ల‌లు, బాలీవుడ్ స్టార్ల్ సినిమాల‌కు భారీ ఆఫ‌ర్లు.. వీట‌న్నింటినీ వ‌దులుకుని ఈ సినిమా థియేట‌ర్ల‌లోనే విడుద‌ల అయ్యింది. 

క‌రోనాను ప్ర‌జ‌లు ఖాత‌రు చేసే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో ఈ సినిమాకు థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌కే ద‌క్కాయి, ద‌క్కుతున్నాయి. ఈ సినిమా నెట్ వ‌సూళ్లు రూ.150 కోట్ల రూపాయ‌ల‌కు చేరాయ‌ని బాక్సాఫీస్ పండిట్లు చెబుతున్నారు. గుజ‌రాత్, ముంబై ఏరియాలో ఈ సినిమాకు ఇంకా మంచి వ‌సూళ్లే వ‌స్తున్నాయ‌ట‌. ఇదే ప‌రిస్థితి కొన‌సాగిస్తే.. ఈ సినిమా నెట్ క‌లెక్ష‌న్ రూ.200 కోట్ల రూపాయ‌ల‌కు చేరవ‌చ్చ‌నే అంచ‌నాలు వ్య‌క్తం అవుతున్నాయి! గ్రాస్ సంగ‌తెలా ఉన్నా.. నెట్ క‌లెక్ష‌న్స్ రెండు వంద‌ల కోట్ల రూపాయ‌లంటే మాట‌లేమీ కాదు!

ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వ‌సూళ్ల సాధ‌న‌కు మ‌రెంతో స‌మ‌యం లేదు. ఇంకో ఇర‌వై రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఏతావాతా.. ఇంకో వారం ప‌ది రోజులు మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌సూళ్ల‌కు ఆస్కారం ఉన్న‌ట్టు. ఒక్క‌సారి ఓటీటీలో విడుద‌ల‌య్యాకా.. థియేట‌ర్ల‌లో ఈ సినిమాకు వ‌సూళ్ల‌కు ద‌క్కే ఆశించ‌డం కూడా క‌ష్ట‌మే. అయితే ఓటీటీలో విడుద‌ల ఈ సినిమా ప్రాఫిట్స్ ను భారీగా పెంచ‌నుంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమా ఓటీటీ రేటు ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల‌ని స‌మాచారం. బాలీవుడ్ బిగ్ స్టార్లు క‌నిపిస్తున్న సినిమా కావ‌డంతో.. దీని ఓటీటీ రేటు హై రేంజ్ లో ప‌లికిన‌ట్టుగా ఉంది. బాక్సాఫీస్ వ‌సూళ్లు నెట్ గా నూటాభై కోట్ల రూపాయ‌ల మార్కును అందుకుంటూ ఉండ‌టం, ఓటీటీ విడుద‌ల రూపంలో వంద కోట్లు.. అంటే ఈ సినిమా రూప‌క‌ర్త‌ల పంట పండిన‌ట్టే. ఇంకా అనేక మార్గాల్లో ఆదాయం ఉండ‌నే ఉంటుంది. ఏతావాతా.. క‌రోనా ప‌రిస్థితుల త‌ర్వాత బిగ్గెస్ట్ స‌క్సెస్ గా ఈ సినిమా నిలుస్తోంది.