ఎలా వుండాలో అలాగే వుంది. ఎలా వుంటుందని అనుకున్నారో అలాగే వుంది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అఖండ ట్రయిలర్. అందరికీ అలవాటైపోయిన, చూసేసిన బోయపాటి మార్క్ డైలాగులు, ఫైట్లు, ఫ్రేమ్ లు, ఫ్యామిలీలు, సీన్లు అంతా అవే ఈ ట్రయిలర్ లోనూ కనిపించాయి. కొత్తదనం అన్నది కలికంలోకి కూడా లేదు.
ఎప్పటి లాగే ఒక బాలయ్య సాప్ట్ గా అందంగా, మరో బాలయ్య రౌద్రంగా, జగపతి బాబుకు బదులుగా శ్రీకాంత్ విలన్ గా చూసేసిన సినిమానే మళ్లీ మరోసారి చూస్తున్న ఫీలింగ్ ఎక్కడో? అయితే ఇవన్నీ ఇలా వుంచితే బాలయ్య ఫ్యాన్స్ కు ఏం కావాలి. మాస్ మహా ప్రేక్షకులకు ఏం కావాలి. అవన్నీ పవర్ ప్యాక్డ్ గా వున్నాయి ట్రయిలర్ లో.
బాలయ్య చెప్పిన డైలాగులకు ఫ్యాన్స్ కు పూనకాలే. అందులో సందేహం లేదు. యాక్షన్ సీన్ల సంగతి సరేసరి. అందువల్ల ట్రయిలర్ ఆ విధంగా చూసుకుంటే పాస్ అయిపోయినట్లే.
బోయపాటి నుంచి బాలయ్య నుంచి అంతకన్నా ఏం కోరుకుంటాం అని ఎవరైనా అంటే సమాధానం వుండకపోవచ్చు. కానీ ట్రయిలర్ ఇంతకన్నా బాగా కట్ చేసే అవకాశం అయితే వుందనే అనిపిస్తోంది కంటెంట్ చూస్తుంటే.