ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. సంక్షేమ పథకాలు తమకు శ్రీరామ రక్ష అని వైసీపీ నమ్మకంతో ఉండగా, అధికార పార్టీపై వ్యతిరేకతే అధికారం తెచ్చి పెడుతుందని టీడీపీ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు, అధికారంపై వైసీపీ ముఖ్య నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలొచ్చినా, ఏ ఎన్నికలొచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. మరోసారి అధికారం తమ పార్టీకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీనే అధికారంలోకి రావాలనేది ప్రజాకాంక్షగా ఆయన చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగిందన్నారు. అందుకే 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలిచి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.
తాను గేట్లు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై వైవీ సుబ్బారెడ్డి సీరియస్‌గా స్పందించారు. గతంలో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు చేర్చుకుని రాజకీయంగా దెబ్బతిన్నాడని గుర్తు చేశారు. ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లే అవకాశం లేదని ఆయన అన్నారు. రాజకీయంగా చంద్రబాబుకు ఝలక్‌లు అలవాటే అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.