టీటీడీ బోర్డులో నేర‌చ‌రితులా…నోటీసులు జారీ!

ఇటీవ‌ల టీటీడీ నూత‌న పాల‌క మండ‌లి ఏర్పాటైంది. ఈ క‌మిటీలో నేర‌చరిత్ర ఉన్న కొంద‌రికి చోటు క‌ల్పించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నూత‌న పాల‌క మండ‌లి ఏర్పాటుపై రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. అత్యంత ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన…

ఇటీవ‌ల టీటీడీ నూత‌న పాల‌క మండ‌లి ఏర్పాటైంది. ఈ క‌మిటీలో నేర‌చరిత్ర ఉన్న కొంద‌రికి చోటు క‌ల్పించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నూత‌న పాల‌క మండ‌లి ఏర్పాటుపై రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. అత్యంత ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌ల‌కు సంబంధించి పాల‌క మండ‌లి బోర్డులో నేర చ‌రిత్ర ఉన్న వారికి చోటు క‌ల్పించ‌డాన్ని విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంక‌టేశ్వ‌ర్లు హైకోర్టులో స‌వాల్ చేశారు.

చింతా దాఖ‌లు చేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంపై జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. టీటీడీ నూత‌న పాల‌క మండ‌లిలో దేవాదాయ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా నేర చ‌రిత్ర ఉన్న శ‌ర‌త్‌చంద్రారెడ్డి, డాక్ట‌ర్ కేత‌న్‌, సామినేని ఉద‌య‌భానుల‌ను నియ‌మించ‌డం స‌రైంది కాద‌ని, వారి స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న‌ర్ త‌న వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా వారిపై న‌మోదైన కేసుల వివ‌రాల‌ను కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ప్ర‌ధానంగా శ‌ర‌త్‌చంద్రారెడ్డి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో అప్రూవ‌ర్‌గా మారి, ప్ర‌స్తుతం బెయిల్‌పై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి వాళ్ల‌కు టీటీడీ పాల‌క మండ‌లిలో చోటు క‌ల్పించ‌డం అంటే భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌డ‌మే అని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు.  

పిటిష‌న‌ర్ త‌ర‌పు వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం… వివ‌ర‌ణ ఇవ్వాల‌ని దేవాదాయ‌శాఖ కమిషనర్, టీటీడీ ఈవోల‌కు నోటీసులు జారీ చేసింది. అనంత‌రం విచార‌ణ‌ను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.