విశాఖను పాలనా రాజధాని చేయాలన్నది వైసీపీ ప్రభుత్వం పట్టుదల. అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల వ్యవధిలోనే జగన్ నిండు శాసన సభ వేదికగా మూడు రాజధానుల ప్రస్తావనను తీసుకుని వచ్చారు. ఆ మీదట చట్టం చేశారు. ఈ విషయం హై కోర్టులో విచారణ దశలో ఉండగానే చట్టం రద్దు చేసుకున్నారు. హై కోర్టు అమరావతి ఒక్కటే రాజధాని అని పేర్కొంది.
దాని మీద వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే న్యాయపరమైన చిక్కులు లేకుండా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుని విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా దసరా నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారు. వారంలో మూడు రోజుల పాటు ఆయన విశాఖ నుంచే పాలనా వ్యవహారాలను చూస్తారు.
దానికి మరింత బలం చేకూరేలా విశాఖ పోలీస్ కమిషనరేట్ హోదాను పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీ ర్యాంక్ హోదాతో సీపీ పోస్ట్ ఉంటే దాన్ని అడిషనల్ డీజీ ర్యాంక్ గా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు చేసింది. ఈ క్రమంలోనే సీపీ త్రివిక్రం వర్మ బదిలీ మీద వెళ్లారు. ఆయన ప్లేస్ లో అడిషనల్ డీజీ ర్యాంక్ హోల్డర్ అయిన రవి శంకర్ అయ్యన్నార్ ని విశాఖకు బదిలీ చేశారు.
దీంతో విశాఖలో ముఖ్యమంత్రి పాలన సాగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అయింది సీఎం విశాఖలో ఉండడం అంటే లా అండ్ ఆర్దర్ ని కూడా పూర్తిగా కంట్రోల్ లో ఉంచాలి. దాంతో విశాఖ పోలీస్ వ్యవస్థ పరిధిని అడిషనల్ డీజీ ర్యాంక్ కి పెంచేశారు. దీని కంటే కొద్ది నెలల ముందు విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిని మొత్తం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగంలోకి తెస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖలో సీఎం అడుగు పెడతారని, దసరా నుంచి ఉత్తరాంధ్రా వాసుల కోరిక తీరుతుందని తరచూ మంత్రులు చెబుతున్న దానికి అనుగుణంగా ప్రభుత్వం శరవేగంగా విశాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ విజయదశమి విశాఖకు వైసీపీకి ఏపీ రాజకీయాలకు చాలా ప్రత్యేకమైనది అని చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు.