ఇండియాను ఇకపై భారత్‌గా మార్చాలనే ఆలోచనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కలిసి ఐక్యమై, దానికి ఇండియా అనే పేరు పెట్టుకున్న నేపథ్యంలో, దాన్ని మోదీ సర్కార్ కనిపించకుండా, వినపించకుండా కుట్రకు తెరలేపిందని ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా ఇండియాకు భారత్ అనే పేరు పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరు మార్పులో తనకేం తప్పు కనిపించట్లేదని మంత్రి రోజా అన్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో రోజా మాట్లాడుతూ ఇంగ్లీష్‌లో ఇండియా అనడం కంటే.. తెలుగులో భారత్ అని అనడం చాలా బాగుందని చెప్పుకొచ్చారు.
ఇండియా పేరును భారత్‌గా మార్చడం వెనుక వ్యక్తిగతంగా తనకు ఎలాంటి వివాదం కనిపించడం లేదని రోజా అన్నారు. ఇదే విషయమై మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. విపక్షాల కూటమికి ఇండియా అనే పేరు వుండడం వల్లే దాన్ని మార్చారని జనం అనుకుంటున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భారత్‌గా మార్చడంలో తప్పు లేదన్నారు. అయితే దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మోదీ సర్కార్‌పై వుందన్నారు.