తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గట్టిగా హితవు చెప్పడం చర్చనీయాంశమైంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం మద్దతు కోరుతూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కవిత మంగళవారం లేఖలు రాశారు. ఈ పరంపరలో షర్మిలకు కూడా కవిత లేఖ రాయడం గమనార్హం. కవిత లేఖకు షర్మిల స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమోదింపజేయాలని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కోరారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు చారిత్రక అవసరమని, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిథ్యం వుంటేనే దేశం పురోగమిస్తుందని ఆమె పేర్కొన్నారు. కవిత లేఖపై షర్మిల సమాధానం ఏంటో తెలుసుకుందాం.
భారత పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధించేందుకు కవిత తన మద్దతు కోరారని షర్మిల పేర్కొన్నారు. అయితే కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్ఎస్లో ఐదు శాతం లోపే 2014లో అవకాశం కల్పించాలని షర్మిల గుర్తు చేశారు. 2014లో ఆరుగురు మహిళలు, 2018లో కేవలం నలుగురికి మాత్రమే సీట్లు ఇచ్చారని కవితకు తెలియజెప్పారు.
మహిళల రిజర్వేషన్‌పై మద్దతు కోరుతున్న ఎమ్మెల్సీ కవిత మొట్టమొదట బీఆర్ఎస్లో మహిళల ప్రాతినిథ్యం పెంచి దేశానికి ఆదర్శంగా నిలిచేలా తండ్రి కేసీఆర్‌పై ఒత్తిడి పెంచాలని విన్నవించారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా కవితకు పంపుతున్నట్టు షర్మిల పేర్కొన్నారు. ఇందులో మహిళలకు ఎంత శాతం సీట్లు ఇచ్చారో లెక్కించాలని షర్మిల కోరారు. కేవలం ఏడు శాతం మాత్రం మహిళకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందని షర్మిల పేర్కొన్నారు.
కావున మహిళా రిజర్వేషన్ సమస్యపై మొదట తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో చర్చించాలని కవితను అభ్యర్థిస్తున్నట్టు షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళలకు ఎంత మంది మహిళలకు సీట్లు ఇచ్చిందో లెక్కించేందుకు ఆన్లైన్ క్యాలిక్యులేటర్ లింక్ పంపుతున్నట్టు కవితకు తెలపడం చర్చనీయాంశమైంది.