ఎన్టీఆర్-జగన్ ఇద్దరూ అడిగారు.. జగన్ ఇచ్చారు

ముఖ్యమంత్రి జగన్, తాజాగా లక్ష్మీపార్వతికి ఓ నామినేటెడ్ పదవి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు లక్ష్మీపార్వతి. అప్పట్లో తన భర్త ఎన్టీఆర్ ఏమీ కోరకుండా తనకు అన్నీ ఇచ్చారని, ఇప్పుడు…

ముఖ్యమంత్రి జగన్, తాజాగా లక్ష్మీపార్వతికి ఓ నామినేటెడ్ పదవి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు లక్ష్మీపార్వతి. అప్పట్లో తన భర్త ఎన్టీఆర్ ఏమీ కోరకుండా తనకు అన్నీ ఇచ్చారని, ఇప్పుడు జగన్ కొడుకులా తనకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నారని అన్నారు.

“అప్పట్లో ఎన్టీఆర్ నాకు వరం ఇచ్చారు. ఏదైనా అడుగు ఇస్తానన్నారు. నేను అడగలేదు. ఆ తర్వాత పదవి ఆశించిన టైమ్ లో నా పట్ల దారుణమైన మోసం జరిగింది. నా కుటుంబంలోనే అల్లుడు నన్ను మోసం చేశాడు. ఇప్పుడు జగన్ కూడా ఎన్టీఆర్ లానే అడిగారు. అమ్మ ఏం కావాలో చెప్పండన్నారు. ఈసారి కూడా నేను ఏం అడగలేదు. జగనే కోరి నాకు పదవి ఇచ్చారు. నా స్థాయికి అది చిన్న పదవి అని భావించి దానికి కేబినెట్ హోదా కూడా ఇచ్చారు.”

తను ఎమ్మెల్సీ ఆశించలేదంటున్నారు లక్ష్మీపార్వతి. పదవి కావాలని తను ఎప్పుడూ జగన్ ను కోరలేదని, నలుగురు మెచ్చేలా పాలించమని మాత్రమే ఆశీర్వదించానన్నారు. నా మనసు తెలిసి జగనే తనకు తెలుగు అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు లక్ష్మీపార్వతి.

“నేను అడిగితే మా అబ్బాయి జగన్ ఎమ్మెల్సీ ఇచ్చేవాడు. కానీ నాకు సాహిత్యం అంటే ఇష్టమని జగన్ కు తెలుసు. ఆ దిశగా ఏదైనా గౌరవప్రదమైన పదవి ఇస్తే బాగుంటుందని నేను కూడా భావించాను. ఇంత చిన్న కోరిక కోరడమేంటని జగన్ కూడా నవ్వారు. నాకు ఏది ఇష్టమో అది ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.”

ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని మరోసారి గుర్తుచేసుకున్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ ఎక్కడ తనకు కీలక పదవి ఇస్తారో అని భయపడి చంద్రబాబు తన అనుకూల పత్రికలో వ్యతిరేక వార్తలు ఇచ్చేవారని, అలా గతంలో తనకు ఎలాంటి పదవి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.