Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్‌ లీల.. కార్పొరేట్ల గోల..!

జగన్‌ లీల.. కార్పొరేట్ల గోల..!

కార్పొరేట్‌ విద్యా దిగ్గజాల నిగ్గు తేల్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆంగ్ల మాధ్యమం అమలుకు తీసుకున్న నిర్ణయం ఇపుడు ఆయా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండే ఇంగ్లీషు విద్యాబోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఆయా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

వాస్తవానికి ఇంగ్లీషు మీడియం అమలు నిర్ణయం పట్ల సగటు తల్లిదండ్రుల నుండి పెద్దగా అభ్యంతాలు కనిపించలేదనే చెప్పాలి. నేటి సమాజంలో ఇంగ్లీషుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తల్లిదండ్రులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకోవైపు మాతృభాష పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న భాషాభిమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా అమల్లో ఉన్న తెలుగును మరింతగా భ్రష్టు పట్టిస్తారా? అని భాషాభిమానులు మండి పడుతున్నారు.

టీవీ ఛానెళ్ళు, పత్రికల్లో ఈ అంశంపై హాట్‌ హాట్‌ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు మాధ్యం అమలుపై ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టతనిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులో బోధన జరుగుతుండటం వలన మన పిల్లలకు అంతగా ప్రయోజనం లేదన్నది ఆయన వాదన! ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులు, ప్రపంచీకరణ ప్రభావం, నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీషు తప్పనిసరి అంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు.

దేశ, విదేశాల్లో తిరుగులేని రీతిలో రాణించాలంటే అంతర్జాతీయ భాష ఆంగ్లంలో పట్టు అవసరమని నొక్కి వక్కాణించారు. ఇదే సమయంలో మాతృభాష తెలుగుకు అన్యాయం జరగదని, ఇంగ్లీషు మీడియంలో చదివే విద్యార్థులకు తెలుగు, ఉర్దూలలో ఏదో ఓ భాషను తప్పనిసరి చేస్తామని ప్రకటించారు.

ఈ పరిణామంపై ప్రధానంగా కార్పొరేట్‌ విద్యాసంస్థలు కలవరపాటుకు గురయ్యాయి. ఇప్పటికే అమ్మఒడి పథకం పుణ్యమా అని పలువురు తల్లిదండ్రులు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు గుడ్‌బై చెప్పి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చారు.

ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే పేద విద్యార్థులకు సైతం అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నమ్మశక్యం కాక ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి, ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో గణనీయంగా పిల్లల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది.

అమ్మఒడి పథకం కింద ఏడాదికి 15 వేల రూపాయల వంతున విద్యార్థి తల్లి ఖాతాకు జమ చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ఇప్పటికే ప్రభుత్వం రూపొందించింది.

ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఇపుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యాబోధనను తప్పనిసరి చేయడంతో కార్పొరేట్ల గుండెల్లో గుబులు పట్టుకుంది.

ఇదిలావుంటే ఇంగ్లీషు మీడియం నిర్ణయం రాజకీయంగా పెను దుమారానికి తెర తీసింది. వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆయా పార్టీల ప్రధాన నేతలపై వ్యక్తిగత విమర్శలకు తెర లేపింది.

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌ నాయుడు మధ్య మాటల యుద్ధం, ఇరు పార్టీల నేతల మధ్య నడుస్తున్న నాటకీయ పరిణామాలు ఇపుడు రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం వినోదాన్ని పంచిపెడుతున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం నేతలు జనసేనకు బాసటగా నిలిచారు.

ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉందని, తగిన కార్యాచరణ ప్రణాళిక లేకుండా ఇంగ్లీషు మీడియంను ఏ విధంగా అమలు చేయగలరని నిపుణులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

సబ్జెట్‌ టీచర్లు లేకుండా, ఇంగ్లీషు బోధించేందుకు అనువైన వసతుల్లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పంతమాత్రం మంచిది కాదని హితవు పలుకుతున్నారు.

డి శ్రీనివాస్‌కృష

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?