కృష్ణ..కృష్ణా…మరీ ఇంతగా దిగిపోవాలా?

చిన్న చిన్న జర్నలిస్ట్ లో, వెబ్ సైట్లలో గ్యాసిప్ లు రాయడం కోసం నియమితులైన వారో, పొట్ట కూటి కోసమో, యాజమాన్యాల అభిమతం కోసమో కాస్త అటు ఇటు అయిన వార్తలు రాసారు అంటే…

చిన్న చిన్న జర్నలిస్ట్ లో, వెబ్ సైట్లలో గ్యాసిప్ లు రాయడం కోసం నియమితులైన వారో, పొట్ట కూటి కోసమో, యాజమాన్యాల అభిమతం కోసమో కాస్త అటు ఇటు అయిన వార్తలు రాసారు అంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ల పరిస్థితి రీత్యా క్షమించవచ్చు.

ఓ పత్రిక సంపాదకుడు యాజమాన్యం అభిమతానికి అనుగుణంగా వ్యాసాలు రాసారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈనాడులో పనిచేసిన ఎందరో మహామహులు, అందులోంచి బయటకు వచ్చాక, అప్పటి వరకు వెలిబుచ్చిన భావజాలానికి వ్యతిరేకమైన వ్యాసాలు వండి వార్చారు. ఇవన్నీ అర్థం చేసుకోదగ్గవే.

కానీ ఓ లీడింగ్ మీడియా యజమానిగా, సర్వ అధికారాలు తనవే అయిన వ్యక్తి, అడ్డగోలుగా రాతలు రాస్తే, ఆందోళనగా వుంటుంది. కించిత్ ఆగ్రహంగానూ వుంటుంది.

ఆర్కేగా ప్రసిద్ధులైన రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి యజమాని. దానికి ప్రధాన సంపాదకుడు. ఆయన ప్రతి ఆదివారం ఓ కాలమ్ లో తన అభిప్రాయాలు వెల్లడిస్తూ వుంటారు. అలాగే ఈవారం కూడా ఆయన ఏపీలో ‘రహస్య అజెండా’! అనే పేరిట సుదీర్ఘ వ్యాసం వెలువరించారు.

ఆ వ్యాసం చదవగానే చాలా అనుమానాలు పుట్టుకువచ్చాయి. వాటిలో కొన్ని..

బిసిలను గంపగుత్తగా క్రిస్టియన్లుగా మార్చేయడం సాధ్యమేనా? 

అసలు బిసిలను మాత్రమే క్రిస్టియన్లుగా ఎందుకు మార్చేయడం. కాపులను ఎందుకు వదిలేయడం?

ఇంగ్లీషు చదువులు చదువుకుంటే హిందువులను క్రిస్టియన్లుగా మార్చేయడం సులువు అవుతుందా?

ఇంగ్లీషు చదివిన వారంతా క్రిస్టియన్లుగా మారిపోతారు అనుకుంటే, సాప్ట్ వేర్ ఇంజనీర్ లు అందరూ ఎప్పుడో మారిపోయి వుండాలి.

ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్న ఎన్టీఆర్ తో సహా మహామహులు ఎందరో వున్నారు. వారంతా క్రిస్టియన్లుగా మారిపోలేదే?

రహస్య ఎజెండా ఎవరిది?

ఈ అనుమానాల సంగతి పక్కన పెడితే, ఈ వ్యాసం కావచ్చు, ఇలాంటి కథనాలు, వార్తలు రాయడం వెనుక ఆర్కేకు ఓ అద్భుతమైన రహస్య ఎజెండా వున్నట్లు అనిపిస్తోంది.

అజెండా నెంబర్ 1…తన అద్భుతమైన రాతలు, వార్తలతో తేదేపాను-భాజపాను విడదీసినట్లే, ఇప్పుడు వైకాపాను-భాజపాను విడదీయాలని ఆర్కే కంకణం కట్టుకున్నారన్న అనుమానం కలుగుతోంది.

అజెండా నెంబర్ 2…జగన్ ను మొన్న ఎన్నికల్లో ఆదరించిన బ్రాహ్మణులు, కాపులను, ముఖ్యంగా కాస్త హిందూ భావజాలం వున్నవారిని, ఎలాగైనా అతనికి దూరం చేయాలని పథకం రచిస్తున్నట్లు కనిపిస్తోంది.

అజెండా నెంబర్ 3…రాష్ట్రంలో క్రిస్టియన్ల ఎలాగూ మైనారిటీలు. మెజారిటీ ఓటర్లు హిందువులు. అందువల్ల వారిని ఎలాగైనా రెచ్చగొట్టి జగన్ కు దూరం చేయాలన్న కుట్ర దాగినట్లు కనిపిస్తోంది.

అవినీతిని వదిలేసారు

వాస్తవానికి దాదాపు పదేళ్లకు పైగా తెలుగుదేశం అనుకూల మీడియా జగన్ ను దుమ్మెత్తి పోసింది కేవలం అవినీతి ప్రాతిపదికగానే. కావాలంటే 2009, 2014 ఎన్నికల ముందు ఆ మీడియాల్లో వచ్చిన వందలాది కథనాలను చూసుకోవచ్చు. ఈ డిజిటల్ యుగంలో అవన్నీ భద్రమే. లక్ష కోట్ల అవినీతి అంటూ నానా యాగీ చేసారు. కానీ ఇప్పుడు ఆ మాట మరిచిపోయారు. ఎందుకు? జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అనే మచ్చ, చిన్న పుట్టు మచ్చ అంత కూడా పడకూడదని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సభ్యుల విషయంలో కూడా చాలా పద్దతిగా వున్నారు. అందువల్ల అవినీతి అనేది చెల్లని మంత్రం అని అర్థం అయిపోయింది.

రౌడీయిజం..గూండాయిజం

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కడప గూండాలు, ఫ్యాక్షనిజం అంటూ నానా హడావుడి చేసారు. గతంలో కూడా ఇదే మంత్రం విశాఖలో ప్రచారం చేసి విజయమ్మను ఓడించిన సంగతి జనాలకు గుర్తు వుంది. ఈ మంత్రం పఠించి, గుంటూరు ప్రాంతంలో నానా హడవుడి చేసారు. కానీ రాష్ట్రంలోనే మరే ప్రాంతంలో ఈ సమస్య లేకపోవడంతో అది కూడా పారలేదు.

ఇంగ్లీష్ వంక-మతం బురద

దాంతో ఇక మిగిలింది ఈ బ్రహ్మాస్త్రం. జగన్ మీద మతం బురద జల్లడం. హిందువులను రెచ్చ గొట్టడం. 

''..ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు హిందువులు వర్సెస్‌ క్రిస్టియన్లుగా సమాజం విడిపోవడానికి బీజం పడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్యలన్నీఈ దిశగానే ఉన్నాయన్న అనుమానాలు హిందువులలో వ్యాపిస్తున్నాయి.  ఇప్పుడు బీసీలను కూడా మత మార్పిడి చేయిస్తే రాజకీయంగా తాను మరింత బలపడతానని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారని వైసీపీ నాయకులు కూడా అంతర్గత సంభాషణలలో అంగీకరిస్తున్నారు…''

 ''..పేద ప్రజలకు మేలు చేయడం కోసమని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడితే బీసీలనుకూడా క్రైస్తవ మతంలోకి సులువుగా మార్చవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు శంకిస్తున్నారు..''

దళితులు, గిరిజనలు ఎక్కువగా క్రిస్టియన్లుగా మారారట. వాళ్లంతా వైకాపాకు అండగా వున్నారట. ఇక బిసిలను కూడా మార్చేస్తే ఓ పని అయిపోతుందట. మరి ఇక్కడ కాపులను ఎందుకు వదిలేసినట్లు? కాపులకు బిసిలకు అంతగా పడదు అన్న పాయింట్ ను వాడుకుని, కాపులను తెలివిగా తాము అనుకున్న వైపు మళ్లించే యత్నం కాదా? ఇది? అసలు మెడమీద తలకాయ వున్నవాడు ఎవరైనా ఈ వాదనను అంగీకరిస్తారా? ఇది లాజిక్ కు లేదా వాదనకు నిలబడేదేనా? ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే బిసిలను కూడా క్రిస్టియన్లుగా మార్చడం సులువు అవుతుందా? ఏం? కాపులను మార్చడం వీలు కాదా? బ్రాహ్మణులు, క్షత్రియులను మార్చడం వీలుకాదా?

ప్రభుత్వ పాఠశాలల్లో బిసిలు మాత్రమే చదువుకుంటున్నారా? బిసి లు మరీ అంత సులువుగా మతం మార్చేసే జనాల్లో ఈయన గారికి కనిపిస్తున్నారా?

ఈ వాదనకు అర్థం వుందా?

''…ఇంగ్లిష్‌ మీడియం బోధన వల్ల బాల్యం నుంచే పిల్లలను క్రైస్తవ మతంవైపు ఆకర్షించడం సులువు అవుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. క్రైస్తవ సంస్థలు ఏర్పాటుచేసిన మిషనరీ స్కూళ్లలో ఏమి జరుగుతున్నదో అందరికీ తెలిసిందే! క్రైస్తవ మతవ్యాప్తి ఎక్కువగా జరిగిన కోస్తా జిల్లాల ప్రజలలో హిందూ– క్రిస్టియన్‌ అనే భేద భావం ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతోంది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో క్రైస్తవులకే ప్రాధాన్యం లభిస్తోందని హిందువులు అనుమానిస్తున్నారు…''

ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారిని క్రైస్తవం వైపు ఆకర్షించడం సులువు అవుతుందా? మరి అమాయకపు గిరిజనులు, దళితులే ఎందుకు మారుతున్నారు? మీరే చెబుతున్నారు వారే ఎక్కువగా మారారని? ఇప్పుడు మీరే అంటున్నారు ఇంగ్లీష్ చదివితే మారిపోతారని. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లో, అమెరికా వెళ్లిన వారో ఎక్కడ మారిపోయారు? వీళ్లంతా ఇంగ్లీష్ లో నిష్ణాతులేగా. రాష్ట్రంలో అనేక మిషనరీ స్కూళ్లు వున్నాయి. ప్రయివేటు క్రిస్టియన్ యాజమాన్య స్కూళ్లు వున్నాయి. వీటి నుంచి ఏటా వేలాది మంది బయటకు వస్తున్నారు. వీరంతా క్రిస్టియన్లుగా మారి బయటకు వస్తున్నారా? ఎంతటి నిస్సిగ్గు వాదన వినిపిస్తున్నారు రాధాకృష్ణా మీరు?

సోనియా, రాహుల్ సంగతేమిటి?

సోనియా గాంధీ క్రిస్టియన్ అన్న సంగతి మరిచారా? మరి ఆమె క్రిస్టియన్ అయి వుండి, మరో క్రిస్టియన్ అయిన జగన్ ను ముఖ్యమంత్రిని చేయకుండా జైల్లో ఎందుకు పెట్టించారు?  సోనియా క్రిస్టియన్ అయినా ఆమె కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్లు ఎందుకు ఓట్లు వేయలేదు?

సరే, రాహుల్ గాంధీ జంథ్యం వేసుకుని, గుళ్లు గోపురాలు తిరిగి, తాను బ్రాహ్మణుడను, హిందువును అని అన్యాపదేశంగా చెప్పుకుంటూ వచ్చారు. అయినా ఎందుకు హిందువులు ఆయనను దూరం పెట్టారు.

ఇక్కడ ఘనత వహించిన రాధాకృష్ణ అయినా, మరెవరు అయినా గమమించాల్సింది ఒకటి వుంది. జనం ఓ వ్యక్తిని నమ్మినా లేదా అభిమానించినా, మరేమీ చూడరు. మోడీలో అందరూ చూసింది ఏదో చేస్తారని. జగన్ లో బడుగు జనం చూసింది అదే. రిజర్వేషన్లు ఇవ్వలేను, అది తన పరిథిలోనిది కాదు అని చెప్పినా కాపులు జగన్ ఎందుకు ఓటు వేసారు. ఆ సంగతి మరిచిపోతే ఎలా?

అసహ్యించుకుంటారు

ఒక వ్యక్తి మనకు కిట్టనపుడు, మనం సమయం కోసం వేచి వుండాలి. ఆ వ్యక్తి ఎప్పుడు తప్పులు చేస్తాడా? ఎప్పుడు దొరుకుతాడా అన్నది చూడాలి. తప్పులు చేయకుంటే, మనకు దొరకకుంటే మౌనంగా కూర్చొవాలి. అంతే కానీ అక్కసుతో, ఏదో ఒకటి చేయాల్సిందే అన్న దుగ్ధతో, టెక్నికల్ గా ఇలా అంటున్నారు, అలా వినిపిస్తోంది, ఇంకోలా అనుకోవాల్సి వస్తోంది అనే పదజాలం వాడి బురద వేయకూడదు. ఎందుకంటే ఆ బురద మన చేతులకు కూడా అంటుకుని, జనం మనల్ని చూసి అసహ్యించుకునే ప్రమాదం వుంది.

ముఖ్యంగా బాధ్యతాయుతమైన, జనంలో గుర్తింపు వున్న, ఓ మీడియా అధినేత స్థానంలో వున్నవారు ఇలా తొందరపడి పదాలు తూలకూడదు. ఆ విజ్ఞత రాధాకృష్ణగారు తన భవిష్యత్ వ్యాసాల్లో ప్రదర్శిస్తారని ఆశిద్దాం.

ఆర్వీ