Advertisement

Advertisement


Home > Movies - Movie News

'ఏఎన్నార్‌ జీవితం నాలో స్ఫూర్తి నింపింది'

'ఏఎన్నార్‌ జీవితం నాలో స్ఫూర్తి నింపింది'

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు` ఒకటి. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చేత స్థాపించబడింది. ఈ అవార్డు ఒక వ్యక్తి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయబడుతుంది. 

2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. న‌వంబ‌ర్‌17న అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. 

ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ అవార్డ్ ను శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, నటి రేఖ లకు అందజేశారు.

ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డ్స్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి  మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్‌ ఎప్పుడూ మన మనస్సులో ఉంటారు. చనిపోయే ముందు వరకూ ఆయన ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఏఎన్నార్‌ జీవితం నాలో స్ఫూర్తి నింపింది. మా అమ్మకు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. డెలివరీ సమయంలో కూడా అక్కినేని సినిమా చూడాలంటూ అమ్మ పట్టుబట్టి మరీ చూశారట. అందుకేనేమో ఆమె కడుపులో ఉన్న నాకు సినిమాలు అంటే ఇష్టం ఏర్పడిందేమో. అక్కినేని గారితో ‘మెకానిక్‌ అల్లుడు’ చిత్రంలో కలిసి నటించా. ఆయన చాలా బాగా మాట్లాడేవారు. అక్కినేని దగ్గర చాలా నేర్చుకున్నా.’ అంటూ అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని మెగాస్టార్‌ గుర్తు చేసుకున్నారు.

‘శ్రీదేవి, రేఖలకు అక్కినేని పురస్కారం ఇవ్వడం ఎంతో సముచితమైన నిర్ణయం. భారతదేశంతో పాటు ముఖ్యంగా దక్షిణాది గర్వించదగ్గ నటీమణులు శ్రీదేవి, రేఖ అని వారిద్దర్ని సన్మానించుకోవడం గర్వంగా ఉంది. ఇక మరణించే ముందు కూడా నటించిన ఏకైక ‘లేడీ సూపర్‌ స్టార్‌’  శ్రీదేవి. అలాగే రేఖ చేతలు మీదగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు తీసుకోవడం మరిచిపోలేని జ్ఞాపకం. ఇప్పుడు నా చేతుల మీదగా ఆమెకు అక్కినేని పురస్కారం అందచేయడం చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభకు రేఖ వస్తుంటే సభ అంతా నిశ్శబ్దం అయిపోయేది. ఆమెను చూస్తూ అందరూ అలా ఉండిపోయేవాళ్లు. అందుకేనేమో రేఖ ఎక్కువగా సభకు వచ్చేవాళ్లు కాదు. ఇక నా భార్య పేరు సురేఖ అయినా నేను మాత్రం రేఖ అనే పిలుస్తాను. ఎందుకంటే నా ఆరాధ్య నటి రేఖ పేరుతో పిలుస్తాను ఆ విషయం ఇప్పటివరకూ మా ఆవిడకు కూడా తెలియదు.’  అని చిరంజీవి తెలిపారు.

Click Here For Photo Gallery

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?