వైసీపీ తరపున ఫైర్ బ్రాండ్లు ఎవరంటే ఇప్పటి వరకూ ముందుగా వినిపించే పేరు రోజా. ఎన్నికలకు ముందు వరకు రోజా నోటికి అడ్డంగా వెళ్లడానికి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జడుసుకునేవారు. సోమిరెడ్డిని సోదిరెడ్డి అంటూ ఉతికి ఆరేసేవారు రోజా, అప్పట్లో ఏ మంత్రినీ వదిలిపెట్టలేదు, మహిళా ఎమ్మెల్యేలను సైతం ఓ ఆట ఆడుకున్నారు.
ఇక చంద్రబాబుని సైతం పూచిక పుల్ల తీసిపారేసినట్టు విమర్శించేవారు. ఆ తర్వాత అంబటి. అంబటి ఆగ్రహంతో ఊగిపోరు కానీ, సెటైర్లు వేయడంలో దిట్ట. హ్యూమర్ టచ్ తో ఎదుటివారి పరువు తీసిపారేస్తూ మాట్లాడేవారు.
మిగతావాళ్లు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లలో హడావిడి చేసినా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఫైర్ బ్రాండ్లుగా వీరికి మంచి గుర్తింపు ఉండేది. ఎన్నికల తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా కాస్త వెనక్కు తగ్గారు. అంబటి తన స్టైల్ లోనే వెళ్తున్నా, చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసుకున్నారు. కొత్తగా పేర్ని నాని, కన్నబాబు కూడా సెటైర్లు పేలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా తనదైన స్టైల్ లో పంచ్ లు విసురుతూ అసెంబ్లీలో సైతం ప్రతిపక్షాల పరువు తీసిపారేసేవారు. ఫైనల్ గా ఇప్పుడు లైన్లోకి వచ్చారు కొడాలి నాని. ఈయన ప్రెస్ మీట్లు కానీ, తిట్ల దండకాలు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడూ చర్చకు రాలేదు.
కొడాలి నాని అగ్రెసివ్ పొలిటీషియన్ అనే పేరుంది కానీ, ఆయనలో ఇంత హ్యూమర్ టచ్ ఉందని, పద్ధతిగా చంద్రబాబు పరువు తీయడంలో ఇంత నైపుణ్యం ఉందని ఎవరికీ తెలియదు. రెండు రోజులుగా ఆయన ప్రసంగాలు వింటే కొడాలి నోటికి పోతే ఇక అంతే సంగతులు అని అర్థమవుతుంది.
మొన్న ఇసుక రీచ్ దగ్గర యథాలాపంగా ఓ 20నిమిషాలు మాట్లాడి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరువుని హోల్ సేల్ గా తీసేశారు నాని. ఆ కామెంట్లు రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషన్ కావడంతో నిన్న పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారు. 40 నిమిషాల పాటు టీడీపీ నాయకుల్ని, పవన్ కల్యాణ్ ని ఓ ఆటఆడేసుకున్నారు.
అరే ఒరే అంటూ బాబు గాలి తీసిపారేశారు. సన్నబియ్యం ఇస్తానన్నానా సన్నాసీ అంటూ దేవినేనికి కౌంటర్ ఇచ్చారు. ప్యాకేజీ స్టారా, పవర్ స్టారా.. నీపేరేంటి అంటూ పవన్ ని ప్రశ్నించారు. జగన్ తిరుపతి ప్రసాదం తింటారో లేదో తెలుసుకోవాలంటే ఆయనతో ఓసారి తిరుమల యాత్రకు వెళ్లు అంటూ పవన్ కి సలహా ఇచ్చారు.
రోడ్డు రోలర్ లాగా లోకేష్ పార్టీని నలిపేస్తున్నారంటూ చినబాబుపై సెటైర్ పేల్చారు. యనమల రామకృష్ణుడు సహా మిగతా నేతల్ని కుక్కల్ని తరిమి కొట్టినట్టు కొడతామంటూ కాస్త గట్టిగానే మాట్లాడారు. నాని ప్రసంగం వింటే.. రోజా, అంబటి కూడా ఆయన ముందు బలాదూర్ అనే విషయం స్పష్టమవుతుంది.
అంత మాత్రాన మరీ చీప్ గా మాట్లాడలేదు నాని. కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చి, మామని వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకుని, ఇప్పుడు వంశీ విషయంలో నీతులు చెబుతున్న చంద్రబాబు నీకసలు నీతి, నిజాయితీ ఉన్నాయా అంటూ లాజికల్ గానే గడ్డిపెట్టారు.
మొత్తమ్మీద వైసీపీలో కొత్త ఫైర్ బ్రాండ్లు రెడీ అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై పల్లెత్తు మాటంటే.. చాకిరేవు పెట్టి ప్రతిపక్షం వాళ్ల పరువు బజారు కీడ్చడానికి రెడీగా ఉన్నారు వీరంతా.