కుప్పం మున్సిపాలిటీలో రేపు దొంగల పడనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఓట్లను కొల్లగొట్టే దొంగలు కుప్పం వెలుపల పొంచుకుని ఉన్నారని సమాచారం. ఎన్నికల మేనేజ్మెంట్ టీడీపీకి తెలిసినంతగా మరే పార్టీకి తెలియదని ఇంత కాలం ప్రచారం జరుగుతూ వచ్చింది.
ముల్లును ముల్లుతోనే తీయాలని వైసీపీ ఆలోచన. అందుకే ఎన్నికల మేనేజ్మెంట్లో టీడీపీకి అర్థం కాని రీతిలో వైసీపీ సరికొత్త పంథా ఎంచుకుంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారనేది ప్రతిపక్షాల ఆరోపణ.
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలో టీడీపీ దొంగ ఓట్లు వేసుకోకుండానే సుగుణమ్మకు లక్షకు పైగా మెజార్టీ వచ్చిందా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. మొత్తానికి దొంగ ఓట్లు మాత్రం వేసుకుంటున్నారనేది నిజం. ఎవరిది పైచేయి అయితే వాళ్లదే మెజార్టీ. ఇదే వాస్తవం. కుప్పం మున్సిపాల్టీలో పైచేయి సాధించకపోతే పరువు పోతుందని టీడీపీ ఆందోళనగా ఉంది.
అందుకే కేవలం ప్రజలనే నమ్ముకుంటే మునిగిపోతామని, దొంగ ఓట్లు వేయించుకుంటే విజయ తీరాలను దాటే అవకాశం లేదని టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు రోజు దొంగ ఓటర్లను దింపేందుకు టీడీపీ సమాయత్తం అయినట్టు వార్తలొస్తున్నాయి.
బెంగళూరు, కేజీఎఫ్, పలమనేరు నుంచి దొంగ ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ నేతలు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టు వైసీపీ విమర్శలు చేస్తోంది. వీళ్లను కుప్పానికి దూరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఓటింగ్‌కు నేరుగా తీసుకొస్తారని సమాచారం. వీరికి ఒక్కొక్కరికి రూ.5 వేలకు పైగా ఇచ్చినట్టు సమాచారం.