టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాలమిస్ట్ అవతారం ఎత్తారు. ఇందుకు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీ వేదికైంది. అసలు తెలుగు మాట్లాడ్డమే రాని లోకేశ్ … ఏకంగా వ్యాసాలు రాసే స్థాయికి ఎదగడం సంతోషించదగ్గ విషయమే.
ఈ సందర్భంగా సుమతి శతకకారుడు చెప్పిన చక్కటి పద్యం గురించి లోకేశ్ పుణ్యమా అని మరోసారి నెమరు వేసుకున్నాం.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ…!
దీని తాత్పర్యం ఏంటంటే….కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. మంచి సంస్కారవంతంగా అతడు ఎదిగి, పదిమందితో మంచివాడని అనిపించుకున్న రోజే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని సుమతీ శతకకారుడి భావన.
అసలు మాటలే రాని బిడ్డ అకస్మాత్తుగా….అమ్మా అని పిలిస్తే ఆ తల్లికి కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం. సరిగ్గా తెలుగు మాట్లాడ్డం రాదని అవహేళనకు గురి అవుతున్న తన పుత్రరత్నం లోకేశుడు ఏకంగా రచయితగా మారాడంటే…తండ్రిగా చంద్రబాబు ఎంత ఆనందపడుతుంటారో కదా! ప్చ్…అబ్బే అలాంటిదేమీ లేదు. ఎందుకంటే లోకేశ్ కెపాసిటీ గురించి అందరి కంటే బాగా తెలిసిన వారెవరైనా ఉన్నారా? అంటే…మొట్ట మొదట చంద్రబాబే అని చెప్పాలి. లోకేశ్‌కు ఘోస్ట్ రైటర్ ఎవరో కానీ, తరచూ వ్యాసాలు రాసేందుకు సిద్ధమయ్యారు.
గత నెల ఆగస్టు 15న ‘జగన్మోసావతారం’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో నారా లోకేశ్ పేరుతో వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసంలో కరోనా బారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతి రోజూ 10 వేల కరోనా కేసులు, 100 మరణాలు సంభవిస్తున్నాయని లోకేశ్ విలవిలలాడారు. అలాగే కరోనా బాధితులు వైద్యం అందక , వసతులు లేక ప్రాణాలు రక్షించమని వేడుకుంటున్నారని, 108 అంబులెన్స్‌లు ఏవీ? అని నిలదీస్తూ లోకేశ్ ఆర్టికల్ సాగింది.
తాజాగా నేటి ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో నారా లోకేశ్ పేరుతో మరో ఆణిముత్యం లాంటి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ‘దళిత పక్షపాతి- ఎవరు, ద్రోహి ఎవరు?’ అనే శీర్షికతో వైసీపీ దళిత వ్యతిరేక పార్టీగా, టీడీపీ దళితోద్ధారక పార్టీగా చిత్రీకరించేందుకు లోకేశ్ ఘోస్ట్ రైటర్ పడిన తపన కనిపిస్తుంది.
వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులపై 60కి పైగా దాడులు జరిగాయని , అంటే వారానికి ఒక్కటి చొప్పున దాడి జరిగిందని లోకేశ్ ఘోస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులైన దళితులకు, గిరిజనులకు ఆయన ఇచ్చిన బహుమానం వారానికి ఒక దాడి, ఒక అత్యాచారం, కుల వివక్షా ఘటన అని కూడా ఈ వ్యాసంలో సెలవిచ్చారు.
అసలు టీడీపీకి దళితులు, గిరిజనులు ఎందుకు దూరమయ్యారో లోకేశ్ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఈ వ్యాసం చదివిన తర్వాత అలాంటి ప్రయత్నమేదీ జరగలేదని అర్థం చేసుకోవచ్చు. లోకేశ్ పేరుతో ప్రచురితమైన వ్యాసంలో చెప్పినట్టు… 15 నెలల పాలనలో 2 శిరోముండనాలు, 60 దాడులతో జగన్ రెడ్డి దళితులపై దమన కాండ కొనసాగిస్తున్నారనే అనుకుందాం. కానీ ఎన్ని పుంగనూరులైతే…ఒక బెంగళూరుకు దీటు వస్తాయనే చందాన…ఇలాంటి దాడులు ఎన్నైతే మాత్రం…ఒక్క కారంచేడు దుర్ఘటనకు సాటి వస్తాయో లోకేశ్ తెలుసుకుంటే మంచిది.
ఇలాంటి వ్యాసాలతో ఒరిగేదేమీ ఉండదు. తన పేరుతో ఆర్టికల్ పబ్లిష్ అయిందనే ఆత్మసంతృప్తి తప్ప. రాజకీయాల్లో ఎదగాలనుకునే వాళ్లు ఇలాంటి చిల్లరమల్లర వేషాలు వేయడం సరికాదు. రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గం ‘దళిత పక్షపాతి ఎవరు, ద్రోహి ఎవరు’ తేల్చు కోవాల్సిన సమయం వచ్చిందని లోకేశ్ ఘోస్ట్ సెలవిచ్చారు. ఎవరేమిటో తెలుసుకోలేని అమాయ కత్వంలో జనం లేరని లోకేశ్ తెలుసుకుంటే మంచిది. జనం హంస లాంటి వాళ్లు. పాలు, నీళ్లను వేరు చేసి చూడగల విజ్ఞత జనానికి ఉంది. ప్రజలు వివేక వంతులనే విషయాన్ని అంగీకరించక పోవడం వల్లే ఇలాంటి విపరీత రాతలు పుట్టుకొస్తాయి.
ఇక చంద్రబాబు చేయాల్సిన పని ఒకటుంది. ఎటూ తన పేరుతో ఆర్టికల్స్ రాసే వ్యక్తిని లోకేశ్ వెతికి పెట్టుకున్నారు. పనిలో పనిగా లోకేశ్ డూప్‌ను రెడీ చేసుకుంటే….అవసరమైన సమయంలో తప్పుల్లేకుండా తెలుగులో మాట్లాడి పరువు నిలబెట్టే అవకాశం ఉంటుంది. తెలుగు మాట్లాడ్డం చేతకాకే…ఎంతసేపూ ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టిస్తూ లోకేశ్ కాలం వెళ్లదీస్తున్నారు. ఎంత కాలమని ఈ అవస్థలు. ఇలాగైతే లోకేశ్ నాయకుడిగా ప్రజాదరణ పొందేదెన్నడు? మరోవైపు వయస్సు పెరుగుతుండడం, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో టీడీపీ భవిష్యత్‌పై చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.
కావున ఈ సమస్నలన్నింటికి పరిష్కారం కావాలంటే అచ్చం లోకేశ్ మాదిరిగా ఉన్న మరో యువకుడిని వెతికి పట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే రాంగోపాల్‌వర్మకు చెబితే సరిపోతుంది. ఆయనైతే మనిషిని పోలిన మనిషిని కనిపెట్టడంలో దిట్ట. ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తే మంచిది.
చాలా సినిమాల్లో డూప్ పాత్రలే నిజమైన క్యారెక్టర్లగా సక్సెస్ ఫుల్‌గా రాణించి…ముగింపు వచ్చే సరికి అసలు విషయం తెలిసి అంతా హ్యాపీగా ఫీల్ కావడం చూశాం కదా? మనకు పని కావాలే తప్ప…మనిషి ఎవరైతే ఏంటి? కమాన్ చంద్రబాబు…త్వర పడండి సార్!