''..ఉచిత విద్యుత్ ఇస్తే సంస్థలు గుల్లయిపోతాయి. కరెంట్ తీగలు బట్టలు ఆరబెట్టుకోవడానికి తప్ప మరెందుకు పనికిరావు '' ఇదీ ఘనత వహించిన చంద్రబాబు నాయుడు స్టేట్ మెంట్. ఎప్పుడూ…వైఎస్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినపుడు. ఇది జరిగి చాలా ఏళ్లయిపోయింది.
జనం వైఎస్ హామీని నమ్మారు. బాబు నాయుడు ను పదేళ్లపాటు అధికారానికి దూరంగా వుంచారు. ఆ తరువాత నాయుడు గారికి జ్ఞానోదయం అయింది. ఆయన కూడా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ అని కలవరించడం ప్రారంభించారు. అయితే తెలివితేటలు చూపించి జనాలకు నేరుగా డబ్బుల రూపంలో కాకుండా మధ్యలో దళారులను దూర్చారు.
చంద్రన్న కానుక. తమకు నచ్చిన వాళ్ల దగ్గర సరకులు కొని పంచారు. దాంతో ఆ వ్యాపారం సాగించిన అస్మదీయులు బాగుపడ్డారు. అలాగే అన్న క్యాంటీన్..భారీ రేట్లకు టిఫిన్, భోజనం కొని, తక్కువకు అమ్మారు. ఆ విధంగా మధ్యలో వున్నవారు బాగుపడ్డారు.
సరే, ఈ సంగతి పక్కన పెడితే, కరెంట్ సంస్థల వ్యవహారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది. గత కొద్ది నెలలుగా దీని మీద కాస్త యాగీ నడుస్తోంది. అది అలా వుండగానే వ్యవసాయ బోర్లకు వున్న మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇప్పుడు రోజుకు తొమ్మిది గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నారు. దాదాపు ప్రతి చేలోనూ, ప్రతి మోటార్ తొమ్మిదిగంటల పాటు తిరుగుతూనే వుంటుంది. మీటర్లు పెట్టినా ఈ తొమ్మిదిగంటలే తిరుగుతుంది. తరువాత కేంద్రం ఆలోచన ఏమిటన్నది ఎవ్వరికీ ఇప్పటికి అయితే తెలియదు.
కానీ దీనిమీద దేశం అనుకూల మీడియా యాగీ స్టార్ట్ చేసేసింది. వైఎస్ పథకానికి జగన్ మంగళం పాడేస్తున్నారనే తప్పుడు ప్రచారానికి తెరతీసింది. ఇక్కడ కేంద్రాన్ని కాదని జగన్ చేయగలిగింది లేదు. జగన్ మాత్రమే కాదు ఏ రాష్ట్రం కూడా. జిఎస్టి డబ్బులు ఇవ్వలేం అంటే ఏ రాష్ట్రం మాత్రం ఏం చేసింది? నిజంగా వ్యవసాయానికి కరెంట్ లిమిట్ పెట్టి, లేదా యూనిట్ కు రేటు కట్టి, రైతులను ఇబ్బంది పెడితే 'దేశం' యాగీ చేసినా, ఇదంతా జగన్ తప్పే అని తప్పుడు ప్రచారం చేసినా అర్థం వుంది.
కానీ ఆ రెండూ లేవు. జగన్ కు సంబంధమూ లేకుండానే ప్రచారం సాగించడం ఓ వింత. పైగా ఒకప్పుడు తాము ఎద్దేవా చేసిన స్కీము కోసం ఇప్పుడు ప్రేమ ఒలకపోయడం రెండో వింత. మొత్తం మీద నాలుక మడతేయడంలో, మడమ తిప్పడంలో తెలుగుదేశం పార్టీది, దాని అనుకూలమీడియాది సాటిలేని వైఖరి. దాంతో ఎవరూ పోటీ పడలేరు. అది భాజపా తో నెయ్యం, కయ్యం అయినా, కాంగ్రెస్ తో దోస్తీ-కటీప్ అయినా, ఇలా వైఎస్ స్కీమును వ్యతిరేకించి, ప్రేమించడం అయినా.