తను కూస్తే తప్ప తెల్లవారదని అనుకుందట వెనుకటికో వెర్రి కోడి. బీజేపీని అతిగా అభిమానించే వారి తీరును గమనిస్తే.. ఆ సామెత గుర్తురాకమానదు. కమలం పార్టీ 2014 లో అధికారంలోకి రావడంతోనే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని పువ్వు పార్టీ భక్తగణంలో ఒకరైన నటి కంగనా రనౌత్ ఒక సదస్సులో వ్యాఖ్యానించి దుమారం రేపింది.
ఇప్పుడు కంగనాను సమర్థించడానికి బీజేపీ భక్తులు అపసోపాలు పడుతున్నారు. ఆమె వ్యాఖ్యలను బీజేపీ వాళ్లు ఒక్క మాటతో ఖండించి ఉంటే.. అంతటితో పోయేది. అయితే ఒకవైపు పద్మ పురస్కారాన్ని పొంది, మరోవైపు ఇలాంటి అనుచితమైన స్టేట్ మెంట్లు ఇచ్చిన కంగనా కామెంట్ పై బీజేపీ అభిమానులు ఎలా పడితే అలా సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు! ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ తప్పు అని వారి ఇగో చాలా హర్ట్ అయ్యేలా ఉంది! దీని అర్థం 2014లోనే దేశానికి వారు చెబుతున్న నిజమైన స్వతంత్రం వచ్చిందని నమ్మించాలనేది బీజేపీ భక్తుల భావంలాగుంది.
అయితే ఇలా ఎలా పడితే అలా సమర్థిస్తూ పోతే.. ఆ సమర్థన అధికారం ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ, ప్రజల్లో, తటస్థుల్లో ఇలాంటి కామెంట్లు కలుక్కుమనిపిస్తాయని అధికారంలో ఉన్న వారు గుర్తించలేరు! ఒకవైపు బీజేపీ అనేక మందికి అనేక రకాలుగా సుద్దులు చెబుతూ ఉంటుంది. మరి తన వరకూ వచ్చే సరికి ఇలాంటి విషయాలను గుర్తించలేదా? అనేది ఇప్పుడు ప్రశ్న.
2014లోనే నిజమైన స్వతంత్రం అంటున్న బీజేపీ భక్తులు.. మరి వాజ్ పేయి పాలనను ఏమంటున్నట్టు? 1999 నుంచి 2004 వరకూ దేశాన్ని ఏలింది కమలనాథులే కదా? బీజేపీకి పునాదులు వేసిన వాజ్ పేయి, అధ్వానీలే కదా.. ఇప్పుడు దేశ పాలనకు మూల స్తంభాలుగా నిలిచింది. వాజ్ పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ కేంద్ర హోం మంత్రి- ఆ తర్వాత దేశ ఉప ప్రధానిగా వ్యవహరించారు కదా! మరి అది స్వతంత్రం కాదా? ఆఖరికి బీజేపీలోని భక్తగణం ఎక్కడి వరకూ వచ్చిందంటే.. తాము అభిమానించే పార్టీ అధికారంలో ఉన్న 1999-2004 మధ్య కాలాన్ని కూడా మరిచిపోయేంత!
ఒకవైపు వ్యక్తి పూజ రాజకీయానికి అరిష్టం అని ఆర్ఎస్ఎస్ అంటుంది. బీజేపీ వాళ్లూ ఇదే చెబుతారు. రాజకీయంలో వ్యక్తి పూజ ఎక్కువైతే ఎమర్జెన్సీ వంటి అరిష్టాలు వస్తాయని ప్రస్తుతం కేంద్ర మంత్రుల హోదాలో ఉన్న వారు కూడా ఏడాదికోసారి స్టేట్ మెంట్ ఇస్తూ ఉన్నారు. బీజేపీ నేతల స్టేట్ మెంట్ లు అలా ఉంటే.. బీజేపీ తీరు మాత్రం వ్యక్తిపూజలో పరాకాష్టను అందుకుంటూ ఉంది.
వెనుకటికి కాంగ్రెస్ హయాంలో కూడా మరీ ఈ రేంజ్ లో వ్యక్తి పూజ లేదేమో అనుకోవాల్సి వస్తోంది. సోనియాగాంధీ యూపీఏ చైర్మన్ గా, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలుగా ఉన్న సమయంలో .. సోనియమ్మను దేవతగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేసే వారు. ఆ వ్యవహారమే క్రమంగా ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకతను పెంచిందనే విషయాన్ని బీజేపీ వాళ్లు గుర్తుంచుకుంటే మంచిది.
స్వతంత్రం తెచ్చింది తామేనంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటించుకుంటే, 2014లోనే దేశానికి స్వతంత్రం వచ్చిందని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. ఇలాంటి అడ్డగోలు ప్రకటనలను అంతే అడ్డగోలుగా సమర్థించేందుకు వాట్సాప్ యూనివర్సిటీ చాలా కష్టపడుతూ ఉన్నట్టుంది. ఇలాంటి కామెంట్లు అధికారంలో ఉన్న వారికి ఇంపును కలిగించవచ్చునేమో కానీ, తటస్థులకు ఇదంతా కంపుగా మారుతుంది. కమలం పార్టీ ఇన్నాళ్లూ తన సిద్ధాంతాల గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఆ సిద్ధాంతాలు క్రమంగా కాంగ్రెస్ తీరున మారుతున్నాయి.
రాష్ట్రాలకు పాలనా కేంద్రం ఢిల్లీకి మారుతుండటం, ముఖ్యమంత్రులను ఢిల్లీ నుంచినే రిమోట్ కంట్రోల్ ద్వారా మార్చేయగలగడం, కేబినెట్ జాబితా కూడా ఢిల్లీ నుంచి రావడం.. ఇవన్నీ కూడా కాంగ్రెస్ సంస్కృతి. బీజేపీ వాళ్లు ఏవగించుకున్న సంస్కృతి ఇదంతా. ఇప్పుడు బీజేపీ రాజకీయం కూడా అదే రీతిన సాగుతూ ఉంది. ఇప్పుడు దేశానికి స్వతంత్రం విషయంలో కూడా అనుచిత కామెంట్లను బీజేపీ మద్దతుదారులు సులభంగా పాస్ చేయగలుగుతున్నారు.
గతంలో కాంగ్రెస్ లో ఇలాంటి కామెంట్లను ఎవరైనా చేస్తే.. వాటిని సమర్థించడానికి మరో ట్రూప్ ఉండేది కాదు. అయితే భక్తులు ఇప్పుడు దేన్నైనా సమర్థించగలరు, నిరూపించగలరు. సోషల్ మీడియా మేనేజ్ మెంట్ తో ఇదంతా సాధ్యమేనేమో కానీ.. ఇలాంటి అనుచిత వ్యవహారాలు అంతిమంగా రాజకీయంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని చరిత్ర చెబుతోంది. కావాలనుకుంటే బీజేపీ వాళ్లు పరిశీలించుకోవచ్చు!