అవతలి వారిని ఆకర్షించాలని కోరుకోని మనిషి ఉండడు కాబోలు. మనిషి ఏ వయసులో అయినా.. ఏదో రకంగా అవతలి వారిని తను ఆకర్షించాలని అనుకుంటాడు. ఈ విషయాన్ని బయటకు చాలా మంది ఒప్పుకోరు. అయితే అందరికీ కావాల్సిందీ అందరి అటెన్షన్. కనీసం కోరుకున్న వారి అటెన్షన్! మరి అలా అవతలి వారు మీ పట్ల సమ్మోహితులు అయిపోవాలంటే… నిజంగానే మీలో ఎంతో ఉండాలి! ఈ విషయంలో అందం.. డబ్బు.. పవర్ కీలక పాత్రలు పోషిస్తాయనేది జనరల్ రూల్.
అయితే.. అలాంటి కమర్షియల్ లెక్కలు పక్కన పెట్టి, జనరలైజ్డ్ స్టేట్ మెంట్లను పక్కన పెడితే… కూడా అవతలి వారిని ఆకట్టుకునేలా ఎవరికి వారు తమలో అలవరుచుకోగల లక్షణాలు ఎన్నో ఉంటాయి. అన్ని సార్లూ, అందరినీ డబ్బు, అందం, పవర్ ఆకట్టుకునట్టు అయితే.. ఈ మూడు ఉన్న వారు మాత్రమ ఈ ప్రపంచంలో మనుగడ సాగించాలి!
అవతలి వారిని అయస్కాంతంలా ఆకర్షించగల లక్షణాలు కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకోవడం భ్రమ. డబ్బు, పవర్ లు మాత్రమే కలిగిన వారు వాటి అవసరం ఉన్న వారిని మాత్రమే దగ్గర చేస్తాయి. అయితే వ్యక్తిగతంగా ఆకట్టుకోగలిగితే.. పై వాటి ప్రమేయం పరిమితం అవుతుందనేది నిజం.
నిజాయితీ..
నిజాయితీ అంటే.. అదేదో సత్తెకాలపు సత్తయ్య మాట అని తేలికగా తీసేస్తాం కానీ, ఇది ఉన్న వారిని మనమే ఇష్టపడుతూ ఉంటాం. ఏ సెలబ్రిటీకో మనమీ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటాం. ఫలానా.. సెలబ్రిటీ అంత నిజాయితీ పరుడని, ఇంత నిజాయితీతో ఉంటాడని, ఇంత నిజాయితీగా వ్యవహరిస్తాడని చెబుతూ ఉంటాం. మనం అనుకునే నిజాయితీ ఏదో వారిలో ఉండనే ఉండవచ్చు.
మరి అదే నిజాయితీ మనలో ఉంటే.. అవతలి వాళ్లు కూడా ఆకర్షితులు ఎందుకు కారు? ఇదేమీ మరీ కష్టపడిపోయి సాధించేది ఏమీ కాదు. ఫేక్ పర్సనాలిటీ కాకపోవడం, ఏ విషయంలో అయినా.. మీ స్కిన్ ను కాపాడుకోవడమే పరమావధిగా వ్యవహరించకపోవడం, మాట్లాడే మాటకూ.. చేసే చేష్టకూ సంబంధం ఉండటమే నిజాయితీ అనిపిస్తాయి. నిజాయితీగా ఉన్నారని ఎవరూ ప్రత్యేకంగా అభినందించకపోవచ్చు. కానీ.. ఇట్ వర్క్స్! అని పని చేసి తీరుతుంది.
నెగిటివ్ మాటలు తగ్గిస్తే మంచిది!
కీడెంచి మేలెంచమన్నారు.. కానీ, ఏ వ్యవహారంలో అయినా నెగిటివ్ థాట్స్ తోనే వ్యవహరించడం, అవతలి వారితో నెగిటివ్ విషయాల గురించినే చర్చించడం.. ఇవి గొప్ప లక్షణాలు అయితే కాదు. మీరు అవతలి వారికి స్నేహితులే అయినా.. కలిసి ఉన్న సమయంలో అన్నింటికీ భయపడటం, భయపెట్టడం, నెగిటివ్ గా మాట్లాడటం.. ఇవే అలవాటైన లక్షణాలు అయితే అవతలి వారిలో మీపై అసహనం పుట్టడానికి పెద్ద సమయం పట్టదు.
బయటకు చెప్పకపోవచ్చు గాక.. ఈ నెగిటివిటీని అవతలి వారు సహించరు. నెమ్మదిగా మీతో తాము డిస్కస్ చేయాలనుకున్న అంశాలను డిస్కస్ చేయకపోవడం, మిమ్మల్ని దూరం పెట్టడం జరగడం ఖాయం. వీలైనంతగా పాజిటివ్ గా మాట్లాడటం, మిమ్మల్ని ఏదైనా ఒపీనియన్ అడిగినా.. వారిలో భరోసా కలిగేలా మాట్లాడటం మరోసారి మీతో మాట్లాడాలనే కోరికను పెంచుతుంది!
అతిగా ఓపెనప్ అయిపోవద్దు!
మీ గురించి చెప్పుకుంటే చాలా ఉండొచ్చు. కానీ.. అతిగా సమాచారం ఇవ్వడం, అతిగా మీ అనుభవాలను చెప్పుకోవడం, ఇద్దరి మధ్య ఏ ప్రస్తావన వచ్చినా, అందుకు సంబంధించి మీ అనుభవాలను, పాఠాలను చెప్పుకుంటూ పోవడం.. వర్బల్ డయేరియానే తప్ప అదేమీ గొప్ప కాదు!
మీ అనుభవాలు, జ్ఞాపకాలు మీకు గొప్పవే. అయితే.. అవతలి వారికి ఆ సమయంలో వాటి పట్ల ఎంత మేర ఆసక్తి ఉందనేది గ్రహించి మాట్లాడితే మీతో సంభాషణకు ఒక విలువ ఉంటుంది. లేకపోతే మీరు బోర్ కొట్టిస్తున్నట్టే!
స్ట్రాటజీ ఉండాలి!
అవసరమైన వారితో.. వారు స్నేహితులు, బంధువులు, గర్ల్ ఫ్రెండ్.. డేటింగ్ లో ఉన్న పార్ట్ నర్.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే స్ట్రాటజీ కూడా అవసరమే. సందర్భానికి తగ్గట్టుగా మారాలి. మీ మూడ్ కు తగ్గట్టుగానే స్పందించడం, అవతలి వారి పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం.. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు మీరే సమీక్షించుకోవాల్సిన అంశాలు.
కొన్ని సార్లు రిజర్వడ్ గా ఉండాల్సి రావొచ్చు, మరి కొన్ని సార్లు చొరవ చూపించే సందర్భాలూ తప్పవు. ఈ విషయాల్లో స్ట్రాటజీ ఉంటే.. మీరు అమేజింగ్ అండ్ వండర్ఫుల్ పర్సన్ గా నిలుస్తారు!