జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఆంధ్ర‌జ్యోతిలో అనుకూల వార్త‌

ఆంధ్ర‌జ్యోతిలో ఆర్టీసీకి పండ‌గే అనే వార్త ఫ‌స్ట్ పేజీలో ఇండికేష‌న్ ఇచ్చి, లోప‌లి పేజీల్లో వార్త వేసారు. సంక్రాంతికి రూ.141 కోట్లు ఆదాయం పొందింది. నిజానికి ఇది ప్ర‌త్యేక క‌థ‌నంగా వేయాల్సింది. జ‌గ‌న్‌ని పొగ‌డ‌డం…

ఆంధ్ర‌జ్యోతిలో ఆర్టీసీకి పండ‌గే అనే వార్త ఫ‌స్ట్ పేజీలో ఇండికేష‌న్ ఇచ్చి, లోప‌లి పేజీల్లో వార్త వేసారు. సంక్రాంతికి రూ.141 కోట్లు ఆదాయం పొందింది. నిజానికి ఇది ప్ర‌త్యేక క‌థ‌నంగా వేయాల్సింది. జ‌గ‌న్‌ని పొగ‌డ‌డం ఇష్టం లేదు కాబ‌ట్టి చిన్న వార్త వేసింది. ఆ మేర‌కు జ్యోతిని మెచ్చ‌కోవాలి. జ‌గ‌న్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కి కోట్లు మిగిలితే ఆ క్రెడిట్ సాక్షి తీసుకోవాలి. అది నిద్రావ‌స్థ‌లో వుంటూ కౌంట‌ర్లు రాసుకుంటూ వుంటుంది. త‌న‌కి మీడియా లేదు అని జ‌గ‌న్ అన‌డంలో అర్థం వుంది.

విష‌యం ఏమంటే ప్ర‌తి సంక్రాంతికి ప్ర‌జ‌ల అవ‌స‌రాన్ని బ‌స్సులు సొమ్ము చేసుకుంటాయి. ప్రైవేట్ వాళ్లు దోచేస్తారు. ఆర్టీసీ కూడా ప్ర‌త్యేక స‌ర్వీసుల పేరుతో జ‌నాల్ని దోచేది. గ‌త ఏడాది 50 శాతం అద‌న‌పు చార్జీతో స‌ర్వీసులు న‌డిపితే వ‌చ్చింది రూ.107 కోట్లు.

ఈ సారి జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు. జ‌నం నుంచి అద‌నంగా వ‌సూలు చేయ‌కూడ‌దు. ఐదు నుంచి ప‌ది శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. దాంతో ప్ర‌యాణికులు  పెరిగారు. అద‌నంగా 1483 స‌ర్వీసులు న‌డిచాయి. ఆర్టీసీకి ఆదాయం వ‌చ్చింది. జ‌నాల‌కి డ‌బ్బు మిగిలింది.

నిజానికి ఆర్టీసీ ఎండీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న కాకుండా ప్ర‌త్యేక క‌థ‌నం చేయాల్సిన వార్త ఇది. అయితే జ‌గ‌న్ అనుకూల వార్త కాబ‌ట్టి అంతటితో స‌రిపెట్టారు. ఒక‌వేళ ఆర్టీసీకి ఏ కార‌ణం వ‌ల్ల అయినా ఆదాయం త‌గ్గి వుంటే జ‌గ‌న్ వింత నిర్ణ‌యాలతో ఆర్టీసీకి న‌ష్ట‌మ‌ని పెద్ద వార్త వ‌చ్చేది.

ప్ర‌జ‌ల‌కి ప్ర‌యోజ‌నం క‌లిగించే వార్త‌ల‌కి మీడియా ప్రాధాన్యం ఇవ్వ‌దు. కోడి పందేలు, జూదాలు హైలెట్ చేస్తారు. సంక్రాంతికి అవి తాత‌ల కాలం నుంచి ఉన్నాయి. జ‌గ‌న్‌తో కొత్త‌గా రాలేదు.

చంద్ర‌బాబు ప‌క్క వూరు రంగంపేట‌లో ద‌శాబ్దాలుగా జ‌ల్లి క‌ట్టు జ‌రుగుతోంది. ఎంతో మంది గాయ‌ప‌డ్డారు కూడా. జ‌ల్లిక‌ట్టుని చంద్ర‌బాబుకి ముడిపెట్ట‌డం ఎంత మూర్ఖ‌త్వ‌మో, కోడి పందేల్ని ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం అన‌డం కూడా అంతే మూర్ఖ‌త్వం.