బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనపై తీవ్ర ఆరోపణలు చేయడంపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. తోట చంద్రశేఖర్‌కు తెలంగాణలో అక్రమంగా వేలాది కోట్లు దోచి పెట్టారని, ఖమ్మం బీఆర్ఎస్ ఖర్చులన్నీ ఆయన పెట్టుకున్నారని రఘునందన్‌రావు ఆరోపించడాన్ని ఆయన తప్పు పట్టారు.
హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో సర్వే నంబర్ 78 లో40 ఎకరాలు తనకు కట్టబెట్టారని ఆరోపిస్తున్నారని, అందులో పది శాతం రాసిచ్చినా ఎక్కడైనా సంతకం చేస్తానని తోట చంద్రశేఖర్ సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై బీజేపీ ఎమ్మెల్యే నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే బీజేపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఖమ్మం బీఆర్ఎస్ సభకు తాను డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో చాలా మంది సభ నిర్వహణకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ దయనీయ స్థితిలో లేదని తోట చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. విభజన సమస్యల్ని కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికే బీఆర్ఎస్ అవతరించిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలపై తూటా లాంటి సవాల్‌ని తోట విసిరారు. ఇక రఘునందన్ ఎలా స్పందిస్తారో చూడాలి.