తేడా వ‌స్తే కుప్పానికో దండ‌మే!!

తెలుగుదేశం పార్టీ మొద‌ట్లో స్థానిక ఎన్నిక‌ల‌కు ఉవ్విళ్లూరింది. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా ఒక వ్య‌క్తి ఉన్నంత సేపూ టీడీపీ స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చాలా ఉత్సాహం చూపించింది. త‌మ చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు…

తెలుగుదేశం పార్టీ మొద‌ట్లో స్థానిక ఎన్నిక‌ల‌కు ఉవ్విళ్లూరింది. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా ఒక వ్య‌క్తి ఉన్నంత సేపూ టీడీపీ స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చాలా ఉత్సాహం చూపించింది. త‌మ చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు కూడా ఆ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ఉత్సాహం చూప‌ని టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా.. ఎన్నిక‌ల అధికారిగా తాము కోరుకున్న వ్య‌క్తి ఉన్నంత వ‌ర‌కూ స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప‌ట్ల ఉత్సాహంతోనే క‌నిపించింది. 

జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ద్దు వ‌ద్దంటున్నా.. స‌ద‌రు అధికారి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌ట్టుప‌ట్టిన త‌రుణంలో, టీడీపీ ఆ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రంకెలు వేసింది. ప్ర‌భుత్వం ఎన్నిక‌లు వద్దంటోందంటే అది చేత‌గాని త‌న‌మే అని, ఓట‌మి భ‌య‌మ‌ని సూత్రీక‌రించారు టీడీపీ నేత‌లు. పార్టీల గుర్తుల‌తో నిమిత్తం లేని పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాకా కూడా టీడీపీ ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప‌ట్ల ఎన‌లేని ఉత్సాహాన్ని చూపించింది. పంచాయ‌తీ ఎన్నిక‌లు అయిపోగానే.. చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్ సైతం పెట్టారు!

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి వ‌చ్చిన ఓట్ల శాతాన్ని ఆయ‌న లెక్క‌గ‌ట్టి చెప్పారు. అస‌లు పంచాయ‌తీ ఎన్నిక‌లే పార్టీల గుర్తుల మీద జ‌ర‌గ‌వు. ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు పార్టీల క‌న్నా.. వ్య‌క్తుల‌నే ప్ర‌ధాన ప్రామాణికంగా తీసుకుంటారు. మ‌రి అలాంటి ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్క‌డ గెలిచింద‌ని చెప్ప‌డం జ‌రిగే ప‌ని కాదు. కాబ‌ట్టి.. ఏ పార్టీ ఎన్ని పంచాయ‌తీ సీట్ల‌ను సొంతం చేసుకుందంటేనే.. నంబ‌ర్ చెప్ప‌డం అబ‌ద్ధ‌మే! అయితే.. చంద్ర‌బాబు మాత్రం.. ఏకంగా ఓట్ల శాతం సైతం చెప్పారు! త‌మ పార్టీకి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 40 శాతం ఓట్లు ల‌భించాయంటూ.. చెప్పుకోవ‌డం చంద్ర‌బాబుకే సాధ్యం అయ్యింది. మ‌రి పార్టీల గుర్తులతో నిమిత్తం లేని పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌య్యే వ‌ర‌కూ చంద్ర‌బాబుకు అలాంటి ఉత్సాహం ఉండింది. అయితే.. మున్సిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు మాత్రం టీడీపీకి వాస్త‌వాన్ని అర్థం అయ్యేలా చేశాయి.

క‌రోనా ప‌రిస్థితుల‌ను కూడా లెక్క చేయ‌కుండా చంద్ర‌బాబు నాయుడు మున్సిప‌ల్-కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి పూనుకున్నారు. రాష్ట్రం న‌లుమూల‌లా తిరిగి.. టీడీపీ గెలిపించాల‌ని కోరారు. అది కూడా మామూలుగా కాదు! మీకు రోష‌ముంటే, పౌరుషం ఉంటే.. టీడీపీని గెలిపించాలంటూ కొన్ని చోట్ల చంద్ర‌బాబు స‌వాళ్లు విసిరారు! అక్క‌డ టీడీపీ ఓడిపోతే అంతే సంగ‌తులు అన్నారు. అలాంటి చోట‌నే ప్ర‌జ‌లు టీడీపీని ఓడించారు. ఆ స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో టీడీపీ కి మామూలు షాక్ కాదు, గ‌ట్టి షాకే త‌గిలింది. 

ప‌ట్ట‌ణ ఓట‌ర్ త‌మ వైపే అని, ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా ప‌ట్ట‌ణాల్లో త‌మ‌కు మంచి ఓటింగ్ శాతం ల‌భిస్తుంద‌న్న టీడీపీ సంప్ర‌దాయ లెక్క‌లు కూడా త‌ల‌కిందుల అయ్యాయి. చంద్ర‌బాబు, టీడీపీ శ్రేణులు చాలా క‌ష్ట‌ప‌డిన మున్సిపోల్స్ లోనే టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. రాష్ట్ర‌మంతా క‌లిపి రెండంటే రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ ఉనికిని చాటుకోగ‌లిగింది!

అప్ప‌టికి త‌మ పార్టీ ప‌రిస్థితి ఏమిటో చంద్ర‌బాబుకు అర్థమైన‌ట్టుగా ఉంది. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీని బ‌లోపేతం చేయ‌డం మాట అటుంచి, బ‌హిష్క‌ర‌ణ ఎత్తుగ‌డ వేశారు. ప్రజ‌లు ఎందుకో ఇంకా టీడీపీ ప‌ట్ల మ‌ళ్లీ విశ్వాసాన్ని చూప‌డం లేదు, ప్ర‌తిప‌క్ష పార్టీగా కూడా టీడీపీని గుర్తించ‌డం లేదు.. అనే స‌మ‌స్య‌ను అర్థం చేసుకుని, దానికి వైద్యం చేసుకోవాల్సిన చంద్ర‌బాబు నాయుడు, ఎన్నిక‌ల్లో పోటీని బ‌హిష్క‌రించే ప‌ని మొద‌లుపెట్టారు! తాము పోటీలో ఉంటే.. చిత్త‌యిపోయామ‌నే అప‌ప్ర‌ద వ‌స్తుంద‌నే లెక్క‌ల‌తో బ‌హిష్క‌ర‌ణ పిలుపుని ఇచ్చారు. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లను నామినేష‌న్ల త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు బ‌హిష్క‌రించారు!  అయితే టీడీపీ గుర్తు మాత్రం బ్యాలెట్ పేప‌ర్ల‌పై నిలిచింది. టీడీపీ ఇంకోసారి చిత్త‌య్యింది!

అదేమంటే.. తాము బ‌హిష్క‌రించిన‌ట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒక విజ‌య‌మా.. అని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటున్నారు! ప్ర‌జాతీర్పును త‌క్కువ చేసి మాట్లాడ‌టం కూడా చంద్ర‌బాబుకు కొత్త కాదు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కూడా చాన్నాళ్లు త‌క్కువ చేసి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలికి గెలిచార‌ని, గాలివాట‌మ‌ని… తోచిన‌ట్టుగా చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు! ఇక స్థానిక ఎన్నిక‌ల్లో, తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజ‌య‌మే కాద‌ని కూడా ఇటీవ‌లే చంద్ర‌బాబు త‌న విలువైన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు!

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీ.. ప‌ని అధికారంలో ఉన్న వారి విజ‌యాన్ని త‌క్కువ చేసి చూప‌డం అయితే కాదు! అధికారంలో ఉన్న వారికి తాము ఏర‌కంగా ప్ర‌త్యామ్నాయ‌మో చాటుకోవ‌డానికి ఇలాంటి ఎన్నిక‌ల‌ను ఉప‌యోగించుకోవాలి. అయితే.. చంద్ర‌బాబు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను త‌క్కువ చేసి చూపి, త‌న అనుకూల మీడియాలో త‌న మాట‌ల‌ను పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో అచ్చేయించుకుని… త‌మ‌దే ఘ‌న విజ‌యంగా భ్ర‌మ‌ప‌డుతున్నారు! 

ఈ భ్ర‌మ‌లు ఏదో రెండు మూడు రోజుల‌కు ప‌నికొస్తాయేమో కానీ.. సంవ‌త్స‌రాల‌కు సంవ‌త్స‌రాలు ఇలాంటి భ్ర‌మ‌లతో ప్ర‌జ‌ల‌ను కానీ, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కానీ స‌ద్దు చేయ‌కుండా ఆపాలంటే అది ఎవ‌రి త‌రం కాదు! ఎంత మీడియా అండ‌దండ‌లున్నా.. టీడీపీ అధినేత ఇలాంటి భ్ర‌మ‌ల‌కు ప్ర‌జ‌ల‌ను ఎక్కువ కాలం లోను చేయ‌లేడు.

ఇక ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీకి ఎన్నిక రావ‌డం తెలుగుదేశం పార్టీకి మ‌రో పీడ‌క‌ల‌గా నిలుస్తున్న‌ట్టుగా ఉంది. కుప్పంలో టీడీపీ చాలా క‌ష్ట‌ప‌డుతూ ఉంది. ఎక్క‌డెక్క‌డి టీడీపీ నేత‌లూ కుప్పం వ‌ర‌కూ వెళ్లారు. అక్క‌డ అతి చేయ‌బోయి.. అక్క‌డ నుంచి ఖాళీ చేయ‌క త‌ప్ప‌లేదు. ఇక చంద్ర‌బాబు నాయుడు కుప్పంలోని శ్రేణుల‌కు దిశానిర్దేశం ఒక రేంజ్ లో చేస్తున్నార‌ని.. గెలుపే ల‌క్ష్యంగా చేయాల్సిన‌వి అన్నీ చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తూ ఉన్నాయి. 

ఇప్ప‌టికే చంద్ర‌బాబు అక్క‌డ ఎక్స్ అఫిషియో ఓట‌ర్ గా కూడా ఎన్ రోల్ చేయించుకున్నారు. మ‌రి ఆ ఓటు హ‌క్కును చంద్ర‌బాబు నాయుడు వినియోగించుకునేంత అవ‌స‌రం అయినా ఏర్ప‌డుతుందా? అనేది మిస్ట‌రీ! మున్సిప‌ల్ చైర్మ‌న్ సీటును టీడీపీ నెగ్గేంత స్థాయిలో వార్డుల వారీగా విజ‌యాన్ని సాధిస్తేనే.. చంద్ర‌బాబు నాయుడు అక్క‌డ త‌న ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీని సాధిస్తే మాత్రం.. చంద్ర‌బాబుకు అక్క‌డ ఓటేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు! టీడీపీనే పూర్తి స్థాయి మెజారిటీని సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంటే.. ఎక్స్ అఫిషియోగా చంద్ర‌బాబు నాయుడు త‌న పేరును ఎన్ రోల్ చేసుకునే వారు కాదు!

ద‌శాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఇంతేనా!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు కుప్పానికి ద‌శాబ్దాల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరిలో ప్ర‌జ‌లు త‌న‌ను ఓడించిన అనంత‌రం తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున చంద్ర‌బాబు నాయుడు కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుని అక్క‌డ ఎమ్మెల్యేగా నెగ్గారు. కుప్పం ఎమ్మెల్యేగానే చంద్ర‌బాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్ ను దించి ముఖ్య‌మంత్రి అయ్యారు. 

ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి హోదాలో 1999 ఎన్నిక‌ల్లో కుప్పం నుంచి మ‌ళ్లీ గెలిచారు. ఇక 2004, 09ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓడినా కుప్పంలో మాత్రం చంద్ర‌బాబుకు మెరుగైన మెజారిటీనే వ‌చ్చింది. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌మంతా టీడీపీ చిత్తైన త‌రుణంలో కుప్పంలో చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ కూసాలు క‌దిలాయి. రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే స‌మ‌యానికి చంద్ర‌బాబు నాయుడు వెనుకంజ‌లో నిలిచి, టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న రేపారు. చివ‌ర‌కు అంత‌కు ముందు ప‌ర్యాయ‌పు మెజారిటీ క‌రిగిపోయింది. 

టీడీపీ బాస్ గా ఎన్నిక‌లకు వెళ్లినప్పుడెప్పుడూ పొంద‌నంత త‌క్కువ మెజారిటీతో గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు గెలిచారు. చంద్ర‌బాబుకు గ‌తంలో వ‌చ్చిన మెజారిటీతో పోలిస్తే.. గ‌త ప‌ర్యాయ‌పు విజ‌యాన్ని బ‌య‌ట‌ప‌డటం అనొచ్చేమో!

ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. బ‌హిష్క‌ర‌ణ అంటూ క‌థ‌ల‌ల్లినా.. సైకిల్ గుర్తు బ్యాలెట్ పేప‌ర్ పై ఉంది. చంద్ర‌బాబుకు కుప్పం పై గ‌ట్టి ప‌ట్టే ఉంటే.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్త‌య్యేదే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. అక్క‌డ పాదం మోపే అవ‌కాశం కూడా ఉండేది కాదు! అయితే.. చంద్ర‌బాబు ఏదో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అనే లెక్క‌ల‌తో కుప్పంలో భారీ మెజారిటీలు పొందారు త‌ప్ప‌, నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉద్ధ‌రించింది కానీ, ప్ర‌జ‌ల‌తో భావోద్వేగ‌పూర్వ‌క‌మైన అభిమానాన్ని పెన‌వేసుకున్న‌ది లేద‌ని ఇప్పుడు స్ప‌ష్ట‌త వ‌స్తోంది.  

వాస్త‌వానికి చంద్ర‌బాబు నాయుడు ఎవ‌రితోనూ భావోద్వేగాల‌ను క‌లిగి ఉన్న రాజ‌కీయ నేత కాదు! ఎవ‌రితో అయినా చంద్ర‌బాబు బంధం అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల మీదే ఆధార‌ప‌డి ఉంటుందనే క్లారిటీ ఎప్పుడో వ‌చ్చింది. దానికి కుప్పం కూడా మిన‌హ‌యింపు కాదు. బ‌హుశా మున్సిపాలిటీ ఎన్నిక‌లు చంద్ర‌బాబు నాయుడు కుప్పానికి పెడుతున్న లాస్ట్ పరీక్ష కావొచ్చు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ అక్క‌డ విజ‌యం సాధిస్తే.. మ‌రోసారి ఆయ‌న కుప్పం నుంచి పోటీ చేయ‌డానికి సాహ‌సిస్తారు. లేక‌పోతే.. ఆయ‌న భాష‌లో చెప్పాలంటే దండం పెట్టి వెళ్లిపోవ‌డ‌మే!

కుప్పం నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఓట్ల‌తో పోలిస్తే.. మున్సిపాలిటీ ప‌రిధిలోని ఓట్లు చాలా త‌క్కువ‌. ఇప్ప‌టికే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌చ్చిన ఓట్లు, అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన మెజారిటీల‌ను లెక్క‌గ‌డితే టీడీపీకి క‌ళ్లు తిర‌గొచ్చు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇదే ప‌రిస్థితి ఉండ‌ద‌నుకున్నా.. ఎంతో కొంత మారుతుంద‌నుకున్నా.. చంద్ర‌బాబు విజ‌యం మాత్రం తేలిక కాదు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ కూడా టీడీపీ చేజారితే, సైక‌లాజిక‌ల్ గా టీడీపీకి అది పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. 

చంద్ర‌బాబు నాయుడే సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మున్సిపాలిటీని నిల‌బెట్టుకోలేక‌పోయారంటే..ఆ త‌ర్వాత జూమ్ మీటింగుల్లో ఆయ‌నేం చెప్పినా, ప‌చ్చ చొక్కాల‌కే అది కామెడీ అవుతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి లోకేష్ టీడీపీ శ్రేణుల‌కే ఇప్ప‌టికే ఎంత ప‌లుచ‌న అయ్యారో, కుప్పంలో టీడీపీ ఓడితే చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా అంతే గౌర‌వ‌మ‌ర్యాద‌లు కూడా అదే స్థాయిలో ఉండ‌వ‌చ్చు. 

కుప్పంలో ఇప్పుడు టీడీపీ ఓడితే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇంకో చోట పోటీ చేయ‌డం లేదా, కుప్పంతో పాటు మ‌రో చోట నామినేష‌న్ వేయ‌డం అయితే సులువే కావొచ్చు! కానీ… దాని ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లోకి టీడీపీ ప‌ట్ల వెళ్లే సంకేతాలు ఎలా ఉంటాయ‌నేది వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు!