చిన్న, మీడియం సినిమాలు అయిపోయాయి. ఇక పెద్ద సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. కరోనా ఫేజ్ 1 తరువాత 2 తరువాత టాలీవుడ్ లో సినిమాలు భయంకరంగా ప్రారంభం అయ్యాయి. హీరోల రెమ్యూనిరేషన్లు అమాంతం పెరిగిపోయాయి. ఏ ఒక్క హీరో ఖాళీగా లేరు. ఏ ఒక్క నటుడు ఖాళీగా లేరు. ఇవన్నీ ఇలా వుంచితే సీనియర్ హీరోల రెమ్యూనిరేషన్లు పెరిగిపోయాయి. బడ్జెట్ లు పెరిగాయి. అసలు నిజంగా సీనియర్ హీరోల సినిమాలకు అంత సీన్ వుందా? అన్నది పెద్ద ప్రశ్న.
చాలా కాలం తరువాత క్రాక్ సినిమా హిట్ కావడంతో రవితేజ హీరోగా సినిమాల మీద సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆయన రెమ్యూనిరేషన్ 18 కోట్లకు చేరిపోయిందని బోగట్టా. నాన్ థియేటర్ హక్కులు పెరగక ముందు ముఫై కోట్ల బడ్జెట్ అంటేనే రవితేజ సినిమాలకు రిస్క్ అనుకునేవారు. అలాంటిది ఖిలాడీ సినిమాకు యాభై కోట్ల ఖర్చు చేస్తున్నారు.
బాలకృష్ణతో పెద్ద డైరక్టర్ల సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి ఇలా వరుసగా. ఆయన రెమ్యూనిరేషన్ కూడా పది కోట్లను దాటేసిందని తెలుస్తోంది. అన్నింటి కన్నా ముందుగా అఖండ విడుదల అవుతోంది. థియేటర్ మీద 50 కోట్లకు పైగా రిస్క్ వున్న సినిమా ఇది.
మెగాస్టార్ చిరంజీవి అయితే 2022 లో ఏకంగా నాలుగు సినిమాలు రెడీ చేస్తున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాలు అన్నీ 2022 డిసెంబర్ కు రెడీ అయిపోతాయని తెలుస్తోంది. ఒక్కో సినిమా వంద కోట్లకు పైగానే బడ్జెట్. ఆచార్య వసూళ్లను బట్టే మిగిలిన సినిమాల సంగతి.
అలవైకుంఠపురం కలెక్షన్లు చూసి, పాన్ ఇండియా సినిమా పుష్ప రెండు భాగాలుగా రెడీ అవుతోంది. బన్నీ మార్కెట్ అలాగే వుందా? పెరిగుతుందా? తగ్గుతుందా అన్నది క్లారిటీ వస్తుంది. 180 కోట్ల బెట్టింగ్ ఇది.
నాని హీరోగా సరైన సినిమా పడి చాలా కాలం అయింది. థియేటర్ ఫెయిల్యూర్ల తరువాత ఓటిటికి రెండు సినిమాలు వెళ్లిపోయాయి. ఇప్పుడు యాభై కోట్ల శ్యామ్ సింగ రాయ్ విడుదల కావాల్సి వుంది. నాన్ థియేటర్ పోను కనీసం ఇరవై నుంచి పాతిక కోట్లు థియేటర్ నుంచి రావాల్సి వుంటుంది.
వెంకీ ఎఫ్ 3 సినిమా విడుదలకు రెడీ అవుతోంది. నాగ్ బంగార్రాజు లైన్ లో వుంది. బంగార్రాజు రిస్క్ లేని ప్రాజెక్టు. జీ టీవీ పెట్టుబడి పెడుతోంది. కానీ ఎఫ్ 3 అలా కాదు. కాస్త భారీ ప్రాజెక్టునే.
వకీల్ సాబ్ సినిమా చాలా కాలం గ్యాప్ తరువాత వచ్చిన పవన్ సినిమా. అందువల్ల నడిచిపోయింది. ఇప్పుడు భీమ్లా నాయక్ వస్తే కానీ అసలు లెక్క తేలదు. దాని ప్రభావం తరువాత సినిమాల మీద వుంటుంది.
ఇలా చాలా సినిమాల సంగతి డిసెంబర్, జనవరి నెలల్లో తేలుతుంది. దాన్ని బట్టే ఏ హీరో మార్కెట్ ఎంత, తీయబోయే సినిమాల పరిస్థితి ఏమిటో అన్న లెక్కలు తేలతాయి. అప్పుడు వుంటుంది హీరోల అసలు సిసలు డిమాండ్.