తెలుగు వారే కాదు, దేశం యావత్తు గర్వించతగిన మేరు పర్వత శిఖరం పీవీ నరసింహారావు. ఆయన ఈ దేశానికి ప్రధాని కావాలనుకోలేదు. దేశమే ఆయన్ని కోరి మరీ చేసుకుంది. దానికి తగినట్లుగా అయిదేళ్ళ పాలనలో దేశం దశ, దిశ మార్చేశారు.
పీవీ అంటే బహు భాషా కోవిదుడు. పీవీ అంటే అపర చాణక్యుడు. పీవీ అంటే తెలుగు జాతి నిలువెత్తు సంతకం. అలాంటి పీవీ రాజకీయాల్లో ప్రతిభ, సమర్ధతలే పెట్టుబడిగా సుదీర్ఘకాలం కొనసాగారు.
ఇక పీవీ కుమారులు గతంలో రాజకీయంగా వెలిగినా ఇపుడు ఆయన కుమార్తె సురభి వాణీదేవి మాత్రమే కనిపిస్తున్నారు. ఆమె తెలంగాణా శాసనమండలికి టీఆర్ఎస్ తరఫున ఆ మధ్య ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. తండ్రిలాగానే ఆమె కూడా విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే వాణిదేవి విశాఖలో సడెన్ గా మెరిశారు. పీవీ నరసింహారావు జీవిత చరిత్ర మీద భాగవతుల శేఖర్ అనే స్థానిక రచయిత రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా తండ్రి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
మొత్తానికి పీవీ నరసింహారావు కుమార్తె విశాఖ రావడంతో ఆయన అభిమానులంతా ఆమెను కలిశారు. పీవీతో తన అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఇక విశాఖతో పీవీకి ఉన్న అపూర్వ బంధాన్ని కూడా ఆమెకు చెబుతూ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ మీదట ఆమె సింహాచలం స్వామి వారిని దర్శించుకుని ఆ పుణ్యక్షేత్రం విశిష్టతను తెలుసుకున్నారు