రద్దు చేయాలంటారా? ఉంచాలంటారా?

పరిపాలన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం కాదు. తొందరపాటు పనికిరాదు. ఒక నిర్ణయం తీసుకునేముందు ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవాలి. పరిపాలన అంటే, రాజకీయాలు అంటే సొంత వ్యవహారం…

పరిపాలన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం కాదు. తొందరపాటు పనికిరాదు. ఒక నిర్ణయం తీసుకునేముందు ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవాలి. పరిపాలన అంటే, రాజకీయాలు అంటే సొంత వ్యవహారం కాదు కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ దగ్గర ఈ లక్షణాలు అంతగా లేవనిపిస్తోంది. ఏడాది కిందట జగన్ తీసుకున్న శాసనమండలి రద్దు నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

మండలిని రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కొన్ని కారణాలతో కేంద్రం ఇప్పటివరకు మండలి రద్దు విషయాన్ని పట్టించుకోలేదు. ఇంతకాలం శాసనమండలిలో అధికార పార్టీకి మెజారిటీ లేదు కాబట్టి ప్రభుత్వమూ పట్టించుకోలేదు. జగన్ పట్టించుకోలేదంటే పట్టించుకోలేదని కాదు. తాను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మండలి రద్దు గురించి అడుగుతూనే ఉన్నాడు. కానీ వాయిదా పడుతూ వస్తోంది.

ఇప్పుడు మండలి గురించి మాట్లాడుకోవడం ఎందుకంటే మండలిలో వైఎస్సార్ సీపీకి పూర్తి మెజారిటీ రాబోతోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం మండలిని రద్దు చెయ్యాల్సిందే అంటుందా? రద్దు చేయొద్దని కోరుతుందా ? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగానూ, ఉత్కంఠభరితంగానూ ఉంది. 

ఏపీ శాసన మండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధించబోతోంది. ఇప్పటికే శాసన సభలో 151 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీకి టీడీపీ నుంచి అనధికారికంగా ముగ్గురు…జనసేన నుంచి ఒకరి మద్దతు ఉంది. ఇక, 58 మంది సభ్యులు ఉన్న శాసన మండలిలో వైసీపీ బలం 32కు చేరబోతగొంది. ప్రస్తుతం శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలో మూడు..స్థానిక సంస్థల కోటాలో 11 సీట్ల భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో..ఈ 14 మంది నియామకానికి సంబంధించి వైసీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది.

ప్రస్తుతం వైసీపీకి 18 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీకి 17 మంది ఉన్నారు. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వైసీపీ సభ్యుల సంఖ్య 18 నుంచి 32కు పెరుగుతుంది. ఆ మేరకు టీడీపీ బలం పడిపోతుంది. 

శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి ఇద్దరు, ముగ్గురు బలం మాత్రమే ఉండేది. ఈ కారణంగా రాజధాని వికేంద్రీకరణ  బిల్లులకు శాసనమండలిలో ఆటంకం ఏర్పడింది.  తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో రాజధాని బిల్లులు మాత్రం సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. అయితే ఆ తర్వాత మళ్లీ అవే బిల్లుల్ని ఆమోదించడం.. తర్వాత కోర్టులకు చేరడంతో  ప్రస్తుతం వివాదం కోర్టులో ఉంది. ఈ వివాదం జరుగుతున్నప్పుడే సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించి.. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశారు.

2020 జనవరిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ .. శాసనమండలి రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యాంగంలో రాజ్యాంగంలోని ఆర్టికల్  169 (1) ప్రకారం.. మండలిని రద్దు చేస్తున్నట్లుగా తీర్మానం చేశారు. తీర్మానికి మూడింట రెండు వంతుల మెజార్టీ ఉండాలన్న నిబంధన ఉండటంతో… విపక్షపార్టీల సభ్యులు ఎవరూ లేకపోయినప్పటికీ ఓటింగ్ నిర్వహించారు. 133 మంది ఎమ్మెల్యేలు తీర్మానికి మద్దతిచ్చారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు.  

కేంద్రం ఈ తీర్మానాన్ని బిల్లుగా మార్చి పార్లమెంటులోని  ఉభయసభల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. మండలి రద్దు విషయంలో రాజ్యాంగంలో అసెంబ్లీకి పూర్తి అధికారం ఇచ్చారని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం మండలి రద్దు తీర్మానం కేంద్రం వద్ద ఉంది.

కేంద్ర న్యాయశాఖ ఆ తీర్మానాన్ని బిల్లు రూపంలోకి మార్చి పార్లమెంట్లో ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే కేంద్రం ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. సాంకేతికంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి..గెజిట్‌లో ప్రకటించిన తర్వాతే మండలి రద్దవుతుంది. శాసనమండలి రద్దు తీర్మానం చేసిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మండలి రద్దు తీర్మానం గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ కరోనా వల్ల పార్లమెంట్ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగని కారణంగా ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పడుతూనే ఉంది.  

ఇక ఇప్పుడు అసలు విషయమేమిటంటే ….శాసనమండలిలో  వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ వచ్చేస్తుంది  కనుక ఇక మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటారా అన్న సందేహం కలుగుతోంది. కానీ వెనక్కి తీసుకోరని వైఎస్సార్ సీపీ నేతలు కొందరు చెబుతున్నారు. ఎందుకంటే… జగన్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని పార్టీ నాయకులు చెబుతుంటారు. ఒక్కసారి ఒక మాట అన్నాడంటే తన మాట తనే వినడు అంటారు. 

జగన్మోహన్ రెడ్డి మండలి రద్దుపై వెనక్కి తగ్గితే మాట తప్పారన్న విమర్శలు వస్తాయి. మండలి రద్దుపై తాము వెనక్కి తగ్గడం లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అందుకే తీర్మానాన్ని వెనక్కి తీసుకోలేరని అంటున్నారు. కేంద్రం ఎప్పుడైతే రాష్ట్ర తీర్మానాన్ని క్లియర్ చేయాలనుకుంటే అప్పుడు మండలి రద్దు అయిపోతుంది. పదవులన్నీ పోతాయి. ఇది జగన్ కు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. 

మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఇప్పటివరకు ప్రక్రియ మొదలుపెట్టలేదు కాబట్టి ఉపసంహరించుకునే అవకాశం ప్రభుత్వానికి  ఉంది. మూడు రాజధానుల బిల్లుల వ్యవహారంలో మండలిలో టీడీపీ  తమకు ఉన్న సంఖ్య బలం తో చక్రం తిప్పింది. దీంతో..మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.  

అదే మండలిలో ఇప్పుడు వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించబోతోంది. కాబట్టి మండలి రద్దు కాకుండా ఉంటే ఇక, రెండు సభల్లోనూ తిరుగు లేని ఆధిపత్యంతో నిర్ణయాలు తీసుకుంటుంది. మరి మండలి రద్దు విషయంలో జగన్ మొండిగా వ్యవహరిస్తాడా? పట్టు సడలిస్తాడా? తేలాల్సి ఉంది.