ఆలు లేదు సూలు లేదు…పార్టీ పేరు జ‌న‌సేన‌

ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న చందంగా…. జ‌న‌సేన పార్టీ త‌యారైంది. అస‌లు ఎన్నిక‌ల్లో పాల్గొన‌డ‌మే చాలా త‌క్కువ‌. పైగా బిల్డ‌ప్‌లు ఎక్కువ‌. తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు వింటుంటే…

ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న చందంగా…. జ‌న‌సేన పార్టీ త‌యారైంది. అస‌లు ఎన్నిక‌ల్లో పాల్గొన‌డ‌మే చాలా త‌క్కువ‌. పైగా బిల్డ‌ప్‌లు ఎక్కువ‌. తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు వింటుంటే న‌వ్వాలో ఏడ్వాలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కే అర్థం కాని ప‌రిస్థితి. గ‌తంలో వివిధ కార‌ణాల‌తో నిలిచిపోయిన నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు 12 మున్సిపాలిటీల‌కు ఈ నెల 15న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే ఈ నెల 14న సర్పంచ్‌, 15న ప‌రిష‌త్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అభ్య‌ర్థులను గెలిపించాల‌ని ప్ర‌జానీకానికి పిలుపునిచ్చారు. పురపాలక, నగర పాలక సంస్థ ల్లోనూ, ప్రజా పరిషత్తుల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో జనసేన పోటీలో నిలిచిందన్నారు. ఒక మార్పు కోసమే ఈ పోరాటమన్నారు. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవ చేయడానికే ముందుంటారన్నారు.

కావున‌ విజ్ఞులైన ప్ర‌జానీకానికి ఇది తెలుస‌న్నారు. అన్ని వేళలా ప్రజల కోసం పని చేస్తూ,  ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పించామని పవన్ తెలిపారు. స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు సామాజిక స్పృహతో పని చేసే వారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందన్నారు. జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు ఎంత మంది ఉన్నారో ప‌వ‌న్ ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఉంది. ఉదాహ ర‌ణ‌కు బ‌లిజలు ఎక్కువ‌గా ఉన్న క‌డ‌ప జిల్లా రాజంపేట‌లో జ‌న‌సేన త‌ర‌పున న‌లుగురు అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. అక్క‌డ మొత్తం 29 వార్డులున్నాయి. నెల్లూరు కార్పొరేష‌న్ విష‌యానికి వ‌స్తే మొత్తం 54 డివిజ‌న్లు ఉన్నాయి. అక్క‌డ జ‌న‌సేన 10-12 స్థానాల్లో మాత్ర‌మే బ‌రిలో నిలిచింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో జ‌న‌సేన కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క చోట మాత్ర‌మే పోటీ చేస్తోంది. ఇలా ఎక్క‌డ తీసుకున్నా…. జ‌న‌సేన దాదాపు బ‌రిలో లేన‌ట్టే. ఇప్ప‌టికీ టీడీపీకి కొమ్ము కాచే జ‌న‌సేనాని తాను ఎవ‌రిని గెలిపించాల‌ని కోరుతున్నారో అర్థం కావ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌న అభ్య‌ర్థులంటే… టీడీపీ వాళ్లేమో అనే వ్యంగ్య కామెంట్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి.