తనను 139 మంది 11 ఏళ్ల పాటు 5 వేల సార్లకు పైగా అత్యచారానికి పాల్పడ్డారంటూ కొన్ని రోజుల క్రితం గిరిజన యువతి పంజగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తీవ్ర సంచలనం రేకెత్తించింది. తనపై ఓ ప్రముఖ యాంకర్, నటుడు, ఓ మాజీ ఎంపీ పీఏ కూడా అత్యాచారానికి పాల్పడ్డారంటే పోలీసులకిచ్చిన ఫిర్యాదుతో పేర్లు, సెల్ ఫోన్ నంబర్లతో సహా వివరాలు ఇవ్వడంతో కేసు మరింత ప్రాచుర్యం పొందింది. ఇదే అదనుగా కొన్ని చానళ్లు తమ రేటింగ్స్‌ను పెంచుకునే అవకాశంగా భావించి బాధిత యువతితో గంటల తరబడి డిబేట్లు చేశాయి.
కొన్ని రోజులు సోషల్ మీడియా, ఇతరత్రా ప్రసార సాధనాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. రెండు రోజుల క్రితం సదరు బాధిత యువతి కుల సంఘాల నాయకులతో మీడియా ముందుకొచ్చి…అంతా డాలర్ బాబు చెప్పినట్టే చేశానని, తనపై 139 మంది కాదు 39 మంది అత్యాచారానికి పాల్పడ్డారని తేల్చి చెప్పడంతో….కేసు మరో మలుపు తిరిగింది. డాలర్ బాబు అలియాస్ రాజా శ్రీకర్‌రెడ్డి తనను బెదిరించి, తను చెప్పినట్టు వినకపోతే కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడంతో, అతను చెప్పినట్టు సంబంధం లేని వ్యక్తుల పేర్లను కూడా ఇరికించినట్టు చెప్పుకొచ్చింది.
యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తనను క్షమించాలని వేడుకొంది. దీంతో కేసు నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజా శ్రీకర్‌రెడ్డి అలియాస్ డాలర్ బాబు సోషల్ మీడయా వేదికగా డాబు ప్రదర్శించడం…ఈ కేసులో మరో ట్విస్టు. అతను మంగళవారం ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో తనపై ఆరోపణలు చేస్తున్న బాధిత యువతి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలే అని అన్నాడు.
సదరు యువతి ఇతరులతో కలిసి తనను అపహరించేందుకు ప్రయత్నించిందని డాలర్ బాబు చెప్పడం ఈ కేసులో ట్విస్ట్‌గా చెప్పుకోవచ్చు. యువతి పన్నిన ఉచ్చు నుంచి తాను తప్పించుకున్నానన్నాడు. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత సురక్షిత ప్రాంతంలో దాచుకుంటున్నట్టు తెలిపాడు.
తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసుల విచారణలో నిజాలన్నీ వెలుగు చూస్తాయని ఆ వీడియోలో చెప్పాడు. అంతేకాదు తాను చెబుతున్న మాటలపై ఎవరికైనా అనుమానం ఉంటే…తన ఫోన్‌లోని కాల్ డేలా, బ్యాంక్ ఖాతాలోని నగదు నిల్వలు పరిశీలించు కోవచ్చని డాలర్ బాబు చెప్పడంతో కేసు మరో మలుపు తిరిగినట్టైంది. బాధిత యువతి రోజుకో మాట చెబుతుండడంతో నమ్మలేని పరిస్థితి. మరోవైపు డాలర్ బాబు తన కాల్ డేటా, బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోమనడంతో….ఎవరి మాటల్లో నిజం ఉందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.