మద్యానికి బానిసయ్యాడు. అలా అని సంపాదన కూడా లేదు. పూర్తిగా భార్య పింఛను డబ్బు పైనే ఆధారపడ్డాడు. చివరికి డబ్బులు ఇవ్వట్లేదని కట్టుకున్న భార్యనే హత్య చేశాడు. క్షణాకావేశంలో దొరబాబు చేసిన ఈ ఘాతుకం అతడ్ని జైలుపాలు చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి దివ్యాంగురాలు. అదే ప్రాంతానికి చెందిన దుర్గారావు అలియాస్ దొరబాబుతో ఆమెకు వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
మద్యానికి బానిసైన దొరబాబు రోజూ ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి తాగి వచ్చేవాడు. దివ్యాంగురాలు కావడంతో విజయలక్ష్మికి పెన్షన్ వస్తుంది. కుటుంబ పోషణను పట్టించుకోకుండా ఆ డబ్బును కూడా తీసుకెళ్లి తాగుడుకు ఖర్చుచేసేవాడు.
అయితే భర్త తాగుడు ఎక్కువవ్వడంతో విజయలక్ష్మి తన పింఛను డబ్బులు ఇవ్వడం మానేసింది. అతడికి కనిపించకుండా రహస్యంగా దాచడం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహించిన దొరబాబు.. పెన్షన్ డబ్బు కోసం తన భార్యపై కత్తితో దాడి చేశాడు. పక్కనే పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా విచక్షణారహితంగా పొడిచేశాడు.
ఈ ఘటనలో విజయలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జరిగిన ఘటనపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొరబాబు వ్యసనం వల్ల ఇప్పుడు పిల్లలు అనాథలయ్యారు.