2024 వ‌ర‌కూ బీజేపీ ప్రెసిడెంట్ ఆయ‌నే!

2024 జూన్ వ‌ర‌కూ భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డానే కొన‌సాగుతార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్టానం ప్ర‌క‌టించింది. త‌ద్వారా వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ న‌డ్డా నాయ‌క‌త్వంలోనే…

2024 జూన్ వ‌ర‌కూ భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డానే కొన‌సాగుతార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్టానం ప్ర‌క‌టించింది. త‌ద్వారా వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ న‌డ్డా నాయ‌క‌త్వంలోనే ఎదుర్కొన‌బోతోంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఈ మేర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ నేష‌న‌ల్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ తో తేల్చారు. న‌డ్డానే త‌మ జాతీయాధ్య‌క్షుడుగా కొన‌సాగుతార‌ని కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ ముఖ్య నేత అమిత్ షా ప్ర‌క‌టించారు. 

ఇటీవ‌ల న‌డ్డా సొంత రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. బీజేపీ జాతీయాధ్యక్షుడి సొంత రాష్ట్ర‌మైన బుల్లి రాష్ట్రంలో ఆ పార్టీ నెగ్గుకు రాలేక‌పోవడం ప్ర‌హ‌స‌నంగా మిగిలింది. అయిన‌ప్ప‌టికా జాతీయాధ్య‌క్షుడిగా న‌డ్డాకు ఎదురులేద‌ని బీజేపీ అధినాయ‌కులు తేల్చి చెప్పారు. రానున్న లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి కూడా ఈయ‌నే నాయ‌కుడు అని స్వ‌యంగా అమిత్ షా ప్ర‌క‌టించారు.

అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కూడా త‌మ‌దేనంటూ అమిత్ షా విశ్వాసం వ్య‌క్తం చేశారు. మంచి మెజారిటీతో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి అధికారాన్ని చేప‌డుతుందంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. ఎవ్వ‌రూ త‌మ విజ‌యాన్ని ఆప‌లేర‌న్న‌ట్టుగా అమిత్ షా ఇలా కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నారు.

అయినా బీజేపీ జాతీయాధ్య‌క్షుడి ఎన్నిక ఇలా జ‌రుగుతుందా! బీజేపీలో కార్య‌క‌ర్త‌లో, స‌భ్య‌త్వంలో పెద్ద హోదాల‌ను క‌లిగిన వారేమైనా జాతీయాధ్య‌క్షుడి ఎన్నిక‌లో పాలు పంచుకుంటారేమో అని ఎవ‌రైనా అనుకుంటూ ఉంటే అలాంటిదేమీ లేద‌ని క‌మ‌లం పార్టీ క్లారిటీ ఇచ్చింది. జాతీయ కార్య‌నిర్వాహ‌ణ విభాగ‌మే జాతీయాధ్య‌క్షుడి ప‌ద‌వీ కాలాన్ని ప్ర‌క‌టిస్తుంద‌న‌మాట‌! ఈ ప‌ద్ధ‌తిలో ఎక్క‌డో సోనియాగాంధీ నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ గుర్తుకు వ‌స్తుందేమో!