ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి నటించినంత ఈజీగా.. బయట నందమూరి, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య స్నేహం మాత్రం లేదు. హీరోలిద్దరూ కలసి నటించారు, స్నేహంగా ఉన్నారు. కానీ ఫ్యాన్ వార్ మాత్రం అలా మిగిలే ఉంది.
అసలు నిజంగానే రెండు కుటుంబాల మధ్య శతృత్వం ఉందా. సినిమాల్లో, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఉన్న రెండు కుటుంబాకు చెందిన వారసులు అసలు ఆ పోటీని, శతృత్వాన్ని ఎలా పక్కనపెట్టగలిగారు. మల్టీస్టారర్ ఎలా చేయగలిగారు. ఈ ప్రశ్న ఇంటర్నేషనల్ మీడియా కూడా అడిగేసింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కోసం వెళ్లిన హీరోలిద్దరూ అక్కడ లాస్ ఏంజిలస్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
అది బోరింగ్.. అందుకే ఫ్రెండ్షిప్
మూడు తరాలుగా సినిమా ఇండస్ట్రీతో చరణ్, ఎన్టీఆర్ కుటుంబాలకు అనుబంధం ఉంది. అప్పట్లో చరణ్ తాత అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ కలసి నటించారు. అప్పట్లో పోటీ లేదు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ జనరేషన్లో విపరీతమైన పోటీ ఉంది. ఆ తర్వాత చరణ్, ఎన్టీఆర్. ఈ ఇద్దరి ఎంట్రీ సినిమాల్లో కాస్త ముందు, వెనక ఉన్నా కూడా పోటీ కామన్. అలాంటి ఇద్దర్నీ ఒకే సినిమాలో నటించేలా చేశారు రాజమౌళి. ఆయన కృషి ఫలితం ఆర్ఆర్ఆర్.
అయితే అంతకు మించి ఎన్టీఆర్, చరణ్ మధ్య ఉన్న బాండింగ్ కూడా ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. కుటుంబాల మధ్య ఉన్న పోటీని పక్కనపెట్టి ఎలా నటించారు అనే ప్రశ్నకు ఇద్దరూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. “మూడేళ్లనుంచి ఈ పోటీ, శతృత్వం అనే మాటలు వింటున్నాం.. వినీ వినీ బోర్ కొట్టేసింది. అందుకే మేం స్నేహాన్ని ఎంచుకున్నాం” అని చెప్పారు చరణ్.
ఇక ఎన్టీఆర్ మాత్రం మరోలా స్పందించారు. తమ మధ్య ఉన్న స్నేహానికి ఫిజిక్స్ తో సంబంధం ఉందన్నారు ఎన్టీఆర్. భిన్న ధృవాలు ఆకర్షించుకున్నట్టుగా తామిద్దరం ఒకరికొకరు ఆకర్షితులమయ్యామన్నారు. టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీస్ సెషన్ లో ఆ బంధం బలపడిపోయిందన్నారు. “చరణ్ తనలో లేనివాటికోసం నాతో కలిశాడు, నాకు ఏం కావాలనుకుంటున్నానో అది చరణ్ నుంచి నేను పొందాను” అని వివరించారు.
మొత్తమ్మీద యువ హీరోలిద్దరూ కుటుంబాలు వేరయినా సినీ కుటుంబం తమది అంటున్నారు. అభిమానులకు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. శతృత్వం లేని ప్రేమ తమ మధ్య ఉందని క్లారిటీ ఇచ్చారు.