పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ, టీడీపీ రెండూ సమావేశాలు నిర్వహించాయి.
పోలవరం ప్రాజెక్ట్ నిధులు, ఏపీ ప్రత్యేక హోదా ఇవి రెండూ వైసీపీ ఎంపీల ప్రధాన ఎజెండా. ఇక టీడీపీ నేతల మీటింగ్ సారాంశం ఏంటంటే.. రాష్ట్రంలో జరుగుతున్న తుగ్లక్ చర్యల్ని పార్లమెంట్ లో ఎండగట్టడం అట.
ఏపీ రాజకీయ రచ్చని జాతీయ స్థాయికి తీసుకెళ్లి దానికి నేషనల్ మీడియా కవరేజ్ ఇవ్వాలనేది చంద్రబాబు చీప్ ట్రిక్.
ఇక్కడ కూడా తన రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు.. చంద్రబాబుకీ వారి ఎంపీలకూ పట్టడంలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడి ఏమీ సాధించలేని చంద్రబాబు ఇప్పుడు ముగ్గురు ఎంపీలతో ఏం చేస్తారు చెప్పండి?
పోనీ ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో కలసి పోరాడతామనడం అదో లెక్క. అన్నీ వదిలేసి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై పార్లమెంట్ లో పోరాడతారట. ఇసుక సమస్య ప్రస్తావిస్తారట, ఇంగ్లిష్ మీడియం సంగతేంటో తేల్చుకుంటారట, ఏపీలో మీడియాపై ఆంక్షలున్నాయని మొరపెట్టుకుంటారట, రివర్స్ టెండరింగ్ చేయకుండా ఆపాలంటూ విన్నవిస్తారట. అసలు వాళ్లు ఎంపీలనుకుంటున్నారా లేక ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాటం చేయాల్సింది పోయి, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తే ఒరిగేదేంటి? వైసీపీ నిర్ణయాలను కేంద్రం సరిచేస్తుందని అనుకుంటున్నారా లేక, వైసీపీకి అధిష్టానం ఎన్డీఏ అని భావిస్తున్నారా? అసలేంటి చంద్రబాబు వ్యూహం. ఈ మీటింగ్ తర్వాత ఎంపీలు చేసిన ప్రకటనలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పరువుని మరింత దిగజార్చాయి.
అధికారంలో ఉన్నప్పుడు, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాలేని అసమర్థులు, ఇప్పుడు మరీ దిగజారి రాష్ట్ర విషయాలను పార్లమెంట్ లో చర్చిస్తామనడం, నిరసన తెలియజేస్తామనడం సిగ్గుచేటు. అయినా ముగ్గురు ఎంపీలు ఉన్న పార్టీకి పార్లమెంట్ లో ఎంత ప్రాధాన్యం దక్కుతుందో అందరికీ తెలిసిందే.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో వైసీపీ, టీడీపీలలో ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ పార్లమెంట్ సమావేశాల్లో తేలిపోతుంది.
ఇకనైనా చంద్రబాబు తన ఆలోచన మార్చుకుని ఢిల్లీలో చీప్ పాలిటిక్స్ చేయకుండా, ప్రత్యేక హోదా ఉద్యమంలో వైసీపీతో కలసి పనిచేయడం మేలు. వాస్తవాన్ని మరిచి ముగ్గురు ఎంపీలతో కేంద్రాన్ని అట్టుడికేలా చేస్తామంటే మాత్రం అంతకంటే కామెడీ ఇంకోటి ఉండదు.