విభజన ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్రాకు రాజకీయంగా విశేష ప్రాధాన్యత ఏర్పడింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ పెట్టాక ఇక్కడ ఉన్న మూడు జిల్లాలు ఏనాడు సైకిల్ దిగలేదు. వైఎస్సార్ టైమ్ లో కూడా గౌరవప్రదమైన స్థానాలే టీడీపీ ఇక్కడ దక్కించుకుంది. అయితే 2019లో మాత్రం మొత్తం సీన్ మారింది. ఎనభై శాతానికి పైగా సీట్లు సాధించి టీడీపీని మూలకు నెట్టింది. అదే పరంపర లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కొనసాగింది.
ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రాకు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సముచిత స్థానం కల్పిస్తున్నారు. పెద్దల సభలో చూసుకుంటే ప్రాతినిధ్యం కూడా ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా పెరుగుతోంది. తాజాగా చూసుకుంటే మూడు జిల్లాల నుంచి నలుగురికి ఎమ్మెల్సీ చాన్స్ దక్కింది. మొత్తం 14 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే అందులో నాలుగు ఈ మూడు జిల్లాలకు అంటే అధిక ప్రాధాన్యత దక్కినట్లే అనుకోవాలి.
ఎమ్మెల్యే కోటాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్ కి చాన్స్ వస్తే, స్థానిక కోటాలో విజయనగరం జిల్లాకు చెందిన ఇందుకూరి రఘురాజుకు అవకాశం ఇచ్చారు. ఇక విశాఖ నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీ గా బంపర్ ఆఫర్ దక్కింది. వారిద్దరూ కూడా పార్టీ కోసం విశేషంగా సేవలు అందించిన వారే.
విశాఖ సిటీ ప్రెసిడెంట్ గా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ అయితే జగన్ కి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్థుడు, అదే విధంగా వరుడు కళ్యాణి రూరల్ జిల్లాలో పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్న మహిళా నాయకురాలు.
ఈ ఇద్దరికీ అవకాశాలు లభించడంతో పనిమంతులకు, నిబద్ధత కలిగిన వారికి తప్పకుండా జగన్ గుర్తుకుంచుకుని మరీ అవకాశాలు ఇస్తారని వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మొత్తానికి ఉత్తరాంధ్రాకు జగన్ పెద్ద పీట వేశారని అంతా అంటున్నారు.