రోడ్డుపై ప్రమాదాలు తగ్గాయి.. ఆన్ లైన్ లో పెరిగాయి

కరోనా కాలంలో రోడ్లు ఖాళీగా ఉన్నాయి, ప్రమాదాలు తగ్గాయి, వాతావరణ కాలుష్యం తగ్గింది.. ఇదో శుభ పరిణామం అంటూ కొంతమంది సంబరపడ్డారు. అయితే వాస్తవానికి కరోనా కాలంలో రోడ్డు ప్రమాదాలు 30శాతం తగ్గితే.. అదే…

కరోనా కాలంలో రోడ్లు ఖాళీగా ఉన్నాయి, ప్రమాదాలు తగ్గాయి, వాతావరణ కాలుష్యం తగ్గింది.. ఇదో శుభ పరిణామం అంటూ కొంతమంది సంబరపడ్డారు. అయితే వాస్తవానికి కరోనా కాలంలో రోడ్డు ప్రమాదాలు 30శాతం తగ్గితే.. అదే సమయంలో ఆన్ లైన్ ప్రమాదాలు.. అంటే ఆన్ లైన్ మోసాలు 500 శాతం పెరిగాయి. దీన్ని నివారించేందుకు కేంద్రం నేషనల్ పాలసీ సిద్ధం చేసే ఆలోచనలో ఉంది.

భారత డిఫెన్స్ స్టాఫ్ అధినేత బిపిన్ రావత్ ఈ విషయంపై కేంద్రం ఓ ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని సూచించారు. సైబర్ దాడుల నివారణకు దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలన్నారు. ఇప్పటికే వివిధ రకాల సైబర్ దాడులు జరుగుతున్నా.. భద్రత విషయంలో ప్రభుత్వాలు చేయగలిగింది, చేసింది తక్కువేనని గుర్తు చేశారాయన. సైబర్ దాడులను కాచుకోవాలంటే మరింత సామర్థ్యం భారత్ సమకూర్చుకోవాలని చెప్పారు.

వైట్ కాలర్ నేరాలు మాత్రమే కాదు.. డ్రోన్ దాడులు, రాన్సమ్ వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. వంటివన్నీ ఈ కోవలోనివే. వీటన్నిటినీ సైబర్ దాడుల కిందకు చేర్చి వాటి నివారణకు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ పై ఆధారపడ్డారు, ఉద్యోగాలు కూడా ఆన్ లైన్ అయిపోయాయి. దీంతో ఆర్థిక లావాదేవీలకే కాదు, రోజువారీ పనులకు కూడా ఆన్ లైన్ అవసరం అవుతోంది. దీంతో సైబర్ నేరగాళ్ల పంట పండింది.

రకరకాల అడ్డదారుల్ని కనిపెడుతూ ఆన్ లైన్ దాడులు మొదలు పెట్టారు సైబర్ మోసగాళ్లు. భారత ఐటీ చట్టం-2000 తో ఇలాంటి దాడుల్ని ఎదుర్కోవడం, వాటికి శిక్షలు విధించడం సాధ్యం కాదు. కొత్త తరహా మోసాలకు కొత్త తరహా చట్టాలను తయారు చేయాలని బిపిన్ రావత్ చెబుతున్నారు. 

సమాచారం(డేటా) అనేది సైబర్ నేరగాళ్లకు ఓ బంగారు గనిలా మారిందని, ఆర్థిక మోసాలతో పాటు, విలువైన సమాచారాన్ని దొంగిలిస్తూ.. కంపెనీలకు అంతకంటే ఎక్కువ నష్టం కలిగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీనిపై భారత ప్రభుత్వం ఎక్కువ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.