మొత్తానికి ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ ను దిగ్విజయంగా తప్పుదారి పట్టించేసినట్లే కనిపిస్తోంది. ఎవరైతే వకీల్ సాబ్ సినిమా ముందు పాత కాలం జీవో తెచ్చి, ఏవో కబుర్లు చెప్పి జగన్ రాత్రికి రాత్రి టికెట్ ల జీవో ఇచ్చేలా చేసారో, అదే టీమ్ ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ మీద కూడా తప్పు దారి పట్టించేసింది.
తెలివిగా జగన్ దగ్గర ఓ మాట, ఇండస్ట్రీ జనాల దగ్గర మరో మాట చెబుతూ డ్యూయల్ రోల్ పాటిస్తున్న ఒకరిద్దరు వ్యక్తులు ఆన్ లైన్ టికెట్ వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. సింపుల్ గా పోయేదాన్ని జటిలం చేసేసారు. ఇక ఇప్పట్లో ప్రభుత్వ పరంగా ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ తయారవుతుందా అన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి.
ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ ను ప్రభుత్వం తలపెట్టినపుడు ముందుగా అనుకున్నది బుక్ మై షో తో కోలాబరేట్ కావాలని. ఆ విధంగా ఎప్పటికప్పడు కలెక్షన్ల వివరాలు ప్రభుత్వానికి అందుతాయి. లెక్కలు పెర్ ఫెక్ట్ గా వుంటాయి. ఆన్ లైన్ తలకాయనొప్పులు అన్నీ బుక్ మై షో చూసుకుంటుంది. ఇప్పటికిప్పుడు కొత్త సాఫ్ట్ వేర్ తయారుచేయాల్సిన పని లేదు. ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండానే, ఖర్చు లేకుండానే పని జరిగిపోతుంది. ఇదీ ముందుగా అనుకున్నది. జగన్ సై అన్నది కూడా దీనికే.
కానీ ఇలా చేస్తే ప్రభుత్వంలో ఈ వ్యవహారంలో దూరే అవకాశం వున్నవారికి లాభం ఏముంటుంది? అందుకే శల్య సారథ్యం చేసేసారు. అంతా మనమే చేసుకుంటే బాగుటుంది. ఇంత ఆదాయం..అంత ఆదాయం అని ఏదోదో జగన్ కు చెప్పేసారు. అంత వరకు రేట్లు పెంచనక్కరలేదు అని కూడా నమ్మ బలికేసారని బోగట్టా. దానికి ఆయన సై అనేసారు.
ఇప్పడు సాఫ్ట్ వేర్ తయారీ పేరిట కోట్లకు కోట్లు ఖర్చు. ఇతరత్రా వ్యవహారాలు. మీటింగ్ లు..ఇంకా..ఇంకా..అయితే ఇక్కడ చిన్న లాజిక్ వుంది. చాలా థియేటర్లు బుక్ మై షో తో, పేటిఎమ్ తో ఇలా అగ్రిమెంట్లు చేసుకుని వున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది. బుక్ మై షో యాజమాన్యం ప్రభుత్వంతో పేచీ పెట్టుకోదు. ధియేటర్ల మీద కోర్టుకు వెళ్తుంది. మాతో అగ్రిమెంట్ వుంది కదా, ఎలా రద్దు చేసుకుంటావు అంటూ. దానికి కోర్టు స్టే ఇస్తుంది. ఇదీ పరిస్థితి అందువల్ల మా ధియేటర్ ను ఆన్ లైన్ కు ఇవ్వలేం అని చేతులెత్తేస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయగలదు?
ఇలా అన్ని థియేటర్ల దగ్గరా జరిగితే ప్రభుత్వ ఆన్ లైన్ స్కీమ్ సాగేనా? ఈ పాటి తెలియదా ఈ వ్యవహారం చూస్తున్నా ఆ ఒక్కరిద్దరికి? తెలుసు. తెలిసినా తెలియనట్లు నడిపిస్తున్నారు. ఈ లోగా కోట్లకు కోట్లు ఖర్చయిపోతాయి. పనులు మాత్రం ఎక్కడివి అక్కడే ఆగిపోతాయి.
గమ్మత్తేమిటంటే ఈ డ్యూయల్ రోల్ వ్యవహారం అన్నింటా సాగుతోంది. ఓ పక్క జగన దగ్గర చేరి ఇఫ్పట్లో రేట్లు పెంచనక్కరలేదు. ఆన్ లైన్ తో పాటే చేద్దాం అని చెబుతున్నారు. మరోపక్కన కొత్త జీవోను ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వం ఏమీ వత్తిడి చేయడం లేదుకదా? మీ పాత రేట్లు మీరు అమ్ముకోండి. మేం అడిగితే కదా? అంటూ టాలీవుడ్ జనాలకు ఎగ్జిబిటర్లకు చెబుతున్నారు. దాంతో పాత రేట్లే అమ్మేస్తున్నారు.
అందుకే ఆ ధీమాతోనే పెద్ద సినిమాలు కూడా థియేటర్ దారి పట్టేస్తున్నాయి. ఇలా జరుగుతున్నది ఎక్కువగా బి. సి సెంటర్లలో. అక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇదే బాగుందని ఇలాగే సాగిపోతోంది. అంటే ఇక ఎప్పటికీ ఆన్ లైన్ జరగదు..కొత్త రేట్ల అమలు జరగదు. పాత రేట్లు హ్యాపీగా అమ్మేసుకుంటారు. ఇదీ స్కీము. ఈ స్కీము వెనుక వున్నది సినిమా వ్యవహారాలకు సంబంధించి జగన్ దగ్గర వున్న అధికార, అనధికార ప్రముఖులు ఇద్దరే అని బోగట్టా.
మరి ఇదంతా జగన్ దృష్టికి ఎప్పుడు వెళ్తుందో, వ్యవహారం మొత్తాన్ని ఆయన తన చేతుల్లోకి ఎప్పుడు తీసుకుంటారో? టికెట్ రేట్ల కలకలం సృష్టించిన వారు టాలీవుడ్ దృష్టిలో మంచిగానే వున్నారు. బ్యాడ్ నేమ్ కాస్తా జగన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీన్ని ఆయన గుర్తించాల్సి వుంది.