విద్యా బోధన ఇంగ్లీష్ లో మంచిదా? లేక మాతృభాషలో మంచిదా??

ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీష్ మాట్లాడే అవసరం ఉన్నా కూడా తమ మాతృభాషలో మాట్లాడుతుంటే వారు తమిళవారు గాని లేదా బెంగాలీ వారు గానీ అయ్యుంటారు. ఇద్దరు వ్యక్తులు అవసరం లేకపోయినా ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు అంటే…

ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీష్ మాట్లాడే అవసరం ఉన్నా కూడా తమ మాతృభాషలో మాట్లాడుతుంటే వారు తమిళవారు గాని లేదా బెంగాలీ వారు గానీ అయ్యుంటారు. ఇద్దరు వ్యక్తులు అవసరం లేకపోయినా ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా వారు తెలుగు వారు అయ్యుంటారు.

తమిళ, బెంగాలీ వారికి తమ మాతృభాషపై అత్యధిక ప్రేమ ఉంటే, తెలుగువారికి తమ మాతృభాష పై అత్యల్ప ప్రేమ ఉంటుంది.

తెలుగు వారికి ఒక్క భాష అనే కాదు. తమవి కానివి ఏవైనా అత్యంత మక్కువ, ప్రీతి. వేష బాషలలోనే కాదు, సంస్కృతి, సాంప్రదాయాలలోను కూడా మనకు ప్రక్కవారివి అనుకరణలే ఎక్కువ. ఇలా తమిళ వారిని వేష భాషల్లో అనుకరించి, జనాభా లెక్కల్లో తమిళులు క్రింద చేరి, మనదైన మద్రాసు నగరాన్ని ఆంధ్ర రాష్ట్రం లో చేరకుండా వదులుకున్నాము.

భాష, మతం, ధర్మం ఇవన్నీ సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగం. నీ భాషను నువ్వు మరిచిపోతున్నావంటే అర్ధం నీ సంస్కృతిని నీ చేతులతో చంపేస్తున్నావని అర్ధం.

“నాకు తెలుగు చదవడం రాయడం రాదు” అని గొప్పగా చెప్పుకునే వారిని మనం ఎంతో మందిని చూశాం. “తెలుగు భాష మన కల్చర్ కనుక మనందరికీ తెలుగు రావాలి” అని ఇంగ్లీష్ లో రాసే వారు ఇంకెందరో.

పుట్టిన పిల్లాడికి మాటలు నేర్పడమే ఇంగ్లీష్ పదాలు నేర్పడం, వాడితో ఇంగ్లీష్ లో మాట్లాడడం, మాట్లాడించడం నేటి నయా ట్రెండ్. మా అమ్మాయికి/ అబ్బాయికి తెలుగు రాదండి అని చెప్పే తల్లిదండ్రులు ఎందరో. నిజానికి వీరెవరు సిగ్గు పడడం లేదు సరికదా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. మరి ఇలాంటి సమాజంలో తెలుగు కొన ఊపిరి తో ఉంది అంటే అందులో అతిశయోక్తి ఏముంటుంది??

ఇప్పుడు విద్యాబ్యాసానికి వద్దాం. ఒక వ్యక్తి తన మాతృభాషలో విద్యాబ్యాసం చేస్తే వాడు ఏ విషయాన్ని అయినా సులువుగా అర్ధం చేసుకోగలడు, ఏ ఇతర భాషలనైనా  సులువుగా నేర్చుకోగలడు అని అధ్యయనాలు చెబుతున్నాయి. పరిశోధనలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.  సాంకేతిక విద్యకు కూడా ఇంగ్లీష్ తో అవసరం లేదు. ఎలాగూ మనం ఇప్పుడు తెలుగు వదిలేసి “టెంగ్లీష్” మాట్లాడుతున్నాం కనుక సాంకేతిక పదాలను ఇంగ్లీష్ లో చదివేస్తే సరిపోతుంది.

ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో చూస్తే అయితే ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ రెండు తప్ప ఇంకేవీ కోర్సులు కాదు అన్నట్లు తయారయింది. తమ పిల్లలను అయితే డాక్టర్లు లేదా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు గా చూసుకోవాలి అని అనుకుంటున్నారు తల్లిదండ్రులు. దురదృష్టవశాత్తు ఈ రెండు కోర్సులకు ఇంగ్లీష్ రావడం ముఖ్యం.

కనుక రాష్ట్రంలో కూడా ఇంగ్లీష్ కి ప్రాధాన్యత అంతే పెరుగుతుంది. ఈ రోజు మాతృభాష ను ఉపయోగించుకునే చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాలు మానుఫ్యాక్చరింగ్ కంపెనీలను స్థాపించుకుని అభివృద్ధి సాధిస్తున్నాయి. కానీ సోఫ్ట్వేర్ ఫీల్డ్ లో భారతదేశంతో ముఖ్యంగా మన తెలుగు వారితో పోటీ పడలేకపోతున్నాయి.

మన రాష్ట్రాలలో తెలుగు ని అభివృద్ధి చేయాలి అంటే మానుఫ్యాక్చరింగ్ రంగంలో అభివృద్ధి జరగాలి. క్రొత్త క్రొత్త కంపెనీ లు రావాలి. కానీ రాజకీయనాయకుల అవినీతి, ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో కంపెనీ పెట్టాలి అంటే 80% ఉద్యోగాలు లోకల్ వారికే ఇవ్వాలి లాంటి రూల్స్ పెట్టడం వలన కంపెనీ లు తెలుగు రాష్ట్రాలకు దూరంగా జరుగుతున్నాయి.

స్కిల్ లేని లోకల్ వారికి కంపెనీ లు ట్రైనింగ్ ఇవ్వడానికి అదనంగా ఖర్చు పెట్టలేక వెనకడుగు వేస్తున్నాయి.

నిజానికి ఈ రోజుల్లో తెలుగు మీడియం ఎవరూ చదవడం లేదు. ఏ కాస్త ఆర్ధిక స్థోమత ఉన్నా ప్రైవేట్ స్కూల్ లలో తమ పిల్లలను జాయిన్ చేసి ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నారు. 

ఇంటర్ వరకు తెలుగు లో చదివి, ఇంజినీరింగ్ ఇంగ్లీష్ మీడియం లో ఉండేసరికి ఇంగ్లీష్ అర్థం కాక వెనకడుగు వేస్తారు అనే భయం వలన. అలా చాలా సంఘటనలు చాలా మందికి జరిగాయి కూడా. దానికి  భాష ఒక ప్రతిబంధకం అయితే విద్యా ప్రమాణాలు కూడా మరో కారణం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్నవారు అత్యంత పేదవారు. మధ్యాహ్న భోజన పథకం క్రింద మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అని వెళ్లేవారే ఎక్కువ. వీరికి ఇంగ్లీష్ మీడియం లో పాఠాలు చెబితే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ లో నిలదొక్కుకోగలరు అని పేద తల్లిదండ్రుల ఆశ. అందుకే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం లో చదువు అనగానే ముందుగా సంతోషించినవారు వీరే. మేధావులు మాతృభాషను చంపేస్తున్నారు అనగానే మాకు ఇంగ్లీష్ విద్యను దూరం చేస్తారా అని వీరు అడుగుతున్నారు. వీరు అడిగే దానిలో కూడా పాయింట్ ఉంది.

ప్రభుత్వాలు కూడా ఏదో మొక్కుబడిగా ఈ ఇంగ్లీష్ విద్యను తేకుండా మనస్ఫూర్తిగా అమలుచేయాలని చూడడం లేదు. టీడీపీ ఇంగ్లీష్ మీడియం విద్యని తీసుకువస్తాము అనగానే ysrp వ్యతిరేకించింది. ఈ రోజు ysrp ఇంగ్లీష్ విద్యను తీసుకుని వస్తాము అనగానే టీడీపీ దానితో పాటు పిల్ల పార్టీ అయిన జనసేన వ్యతిరేకిస్తుంది.

మేధావులు, అధికారం లో లేని రాజకీయపార్టీలు ఇంగ్లీష్ విద్యను వ్యతిరేకించడం తప్ప సమస్యని ఎలా అధికమించాలో సొల్యూషన్ చెప్పడంలేదు.

చెప్పలేరు కూడా. కారణం తెలుగు సమాజానికే తెలుగు వద్దు, ఇంగ్లీష్ ముద్దు. ఇక ఇక్కడ విద్యా బోధన అంటే ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే.

ఇంగ్లీష్ ప్రధానమైన ఈ రెండు కోర్స్ లకు ఇంగ్లీష్ ని తప్పించడం ఎలా?

పైగా అమెరికా వెళ్లి డబ్బులు సంపాదించాలి అనే వేలం వెర్రి చాలా ఎక్కువ మన తెలుగు వారికి. అలా వెళ్లాలి అంటే ఇంగ్లీష్ రావాలి. మీ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పి అమెరికా పంపి మా పేద పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఇంగ్లీష్ వద్దా? మా పిల్లలను మేము అమెరికా పంపవద్దా అని పేద తల్లిదండ్రులు అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పేవారు ఎవరు?

మాతృభాష ప్రాముఖ్యతను విద్యలో పెంచాలి అంటే ముందు ఈ తెలుగు సమాజాన్ని మార్చాలి. వారి ఆలోచనా విధానంలో మార్పు తేవాలి. అంతే కాకుండా బోలెడు కంపెనీలను తెలుగు రాష్ట్రాలలో స్థాపించి మానుఫ్యాక్చరింగ్ రంగంలో అభివృద్ధి ని సాధించాలి. అప్పుడు సాంకేతిక విద్య తెలుగు లో నేర్చినా అది ఈ రంగంలో ఉపయోగపడుతుంది.

ఇంత కష్టం పడే ఓర్పు, నేర్పు నేటి ప్రభుత్వాలకు ఎక్కడ ఉంది? అందుకే అవి “ఎస్కేప్ రూట్” ని ఎంచుకుంటున్నాయి. ప్రజలకు కావలసిన ఇంగ్లీష్ విద్యను అందించడానికి చూస్తున్నాయి.

అసలు సమస్యలను అధికమించకుండా మేధావులు మాతృభాష అని ఎంత గోల పెట్టినా వీసమెత్తు కూడా ఉపయోగం ఉండదు. మాతృభాష మృతిని ఆపే వీలు ఉండదు.

భాస్కర్ కిల్లి