జగన్ రెడ్డీ, జగన్ రెడ్డీ అంటూ దీర్ఘాలు తీసి పలుకుతుంటే.. వైసీపీ నాయకులు టిట్ ఫర్ టాట్ ఇచ్చినట్టు పవన్ ని నాయుడూ అంటూ సంబోధించారు. అంతమాత్రానికే పవన్ ఎక్కడికో వెళ్లిపోయారు. ఏకంగా పుచ్చలపల్లి సుందరయ్యను సీన్ లోకి తీసుకొచ్చి సోషలిజం వేదాలు వల్లించారు. కోస్తాలోని ఒకటీ రెండు జిల్లాల్లో మినహా ఇంకెక్కడా రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి నాయుడు అనే ట్యాగ్ లైన్ ఉండదు. కానీ పవన్ మాత్రం తన పేరు చివర నాయుడు అని లేకపోవడానికి ఏకంగా ఓ కథనే అల్లేసుకున్నారు.
ఆయన తండ్రికి సోషలిజం భావాలు ఎక్కువట, అందుకే కొడుకులెవరికీ నాయుడు అని కలిసొచ్చేలా పేరు పెట్టలేదట. అక్కడితో ఆగితే బాగుండేది. ఆ తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య గురించి కూడా చెప్పారు. సుందర రామిరెడ్డి కాస్తా సుందరయ్యగా తన పేరు మార్చుకున్నారని, సుందరయ్య వారసుల్లో మిత్ర తన పేరులోనే రెడ్డిని లేకుండా చేసుకున్నారని, మరొకరు మాత్రం రెడ్డి పేరు వాడుకున్నారని గుర్తు చేశారు.
పవన్ నాయుడు పవన్ కల్యాణ్ లా మిగిలింది సుందర రామిరెడ్డి సుందరయ్యలా మారినందువల్లేనంటూ అర్థమొచ్చేలా చెప్పుకొచ్చారు జనసేనాని. ప్రజారాజ్యం పేరుతో కాపు రాజకీయం చేసిన వారెక్కడ, పుచ్చలపల్లి ఫ్యామిలీ ఎక్కడ. కాపు ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో వెదుక్కుని మరీ అన్నదమ్ములు నామినేషన్లు వేశారు కదా? దాన్ని కులరాజకీయమంటారో లేక ఇంకేమంటారో పవన్ కల్యాణే చెప్పాలి.
“నన్ను విమర్శిస్తే కాపు వర్గం దూరమవుతుందని భయపడుతున్నారా” అంటూ పరోక్షంగా కులం పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసే పవన్ కల్యాణ్ కులరహిత సమాజం కోసం పాటు పడతానని చెప్పటం సిగ్గుచేటు కాక ఇంకేంటి? పవన్ నెత్తీనోరూ బాదుకున్నా.. జగన్మోహన్ రెడ్డినే జనం ఆశీర్వదించారు. 151 సీట్ల బలం ఇచ్చారు. కేవలం రెడ్డి సామాజిక వర్గమే జగన్ ని సపోర్ట్ చేస్తే ఈ విజయం దక్కుతుందా, ప్రజలంతా కులమతాలకు అతీతంగా జగన్ ని ఆశీర్వదించారు కాబట్టే ఆ ఘన విజయం సొంతమైంది.
కనీసం పవన్ నాయుడు ఈ విషయాన్నైనా అర్థం చేసుకోవాలి. అయినా తననుతాను సూపర్ స్టార్ గా, దైవాంశ సంభూతుడిగా ఊహించుకోవడం పవన్ కు కొత్తేంకాదు. తనకు ఎదురులేదు అన్నట్టు ఉంటాయి, అతని మాటలు చేతలు. ఇప్పటికే పవన్ స్థానం ఏంటో జనం చూపించారు. ఇకనైనా తన భ్రమల నుంచి జనసేనాని బయటకొచ్చి, ఇలా పుచ్చలపల్లితో తనను తాను పోల్చుకోవడం ఆపేస్తే బెటర్.