ఇక నుంచి దొంగజపం అంటే కొంగజపం అనే పేరుపోయి బాబు జపం అనే పేరు వస్తుందేమో. దొంగ దీక్షలు చేయడంలో చంద్రబాబు పెట్టింది పేరు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వ సొమ్ముని హారతి కర్పూరం చేసి దొంగదీక్షలు చేశారు చంద్రబాబు. కేవలం దొంగ బిల్లుల కోసమే ఆ దీక్షలు చేసినట్టు ఆధారాలతో సహా రుజువైంది.
ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రజా సమస్యలు గాలికొదిలేసి, తన రాజకీయ లాభం కోసం దీక్షలు చేస్తున్నారు చంద్రబాబు. ఇసుక దీక్ష అంటూ విజయవాడలో బాబు వేసిన వీరంగం అలాంటిదే. బాబు వన్ డే దీక్ష అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిందనుకోండి అది వేరే విషయం.. అయినా కనీసం దీక్షచేస్తే ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలి, నిజమైన బాధితుల సమస్యలు బైటకు రావాలి, వాటికి పరిష్కార మార్గాలపై మాట్లాడాలి. కానీ బాబు చేసిందేంటి? ఓవర్ యాక్షన్.
ఆ వేదిక చూస్తే అది నిరసన దీక్షలా ఏమాత్రం కనిపించదు. తెలుగుదేశం పార్టీ ప్రచార సభలా ఉంది. కార్మికులకు పసుపు పచ్చ రంగు తట్టలు ఇచ్చారు. జైజై చంద్రన్న అని రాసి ఉన్న కళ్లద్దాలు ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులో లేదా పెయిడ్ ఆర్టిస్టులో తెలియదు కానీ వారికి పసుపు పచ్చ రంగు చీరలు కూడా కట్టించారు. ఇసుక దీక్ష కాస్తా పచ్చ దీక్షగా మారిపోయింది.
ఇది చాలదన్నట్టు మెడలో ఇసుక పొట్లాలు మరో అరాచకం. చంద్రబాబు తన మెడలో ఇసుక పొట్లాల దండ వేసుకున్నారు. మరికొంతమంది నేతలు, కార్యకర్తలతో ఇసుక దండలు వేయించారు. ఇలా టీడీపీ ప్రచార కార్యక్రమంలా సాగింది బాబు దొంగ దీక్ష. భవిష్యత్తులో మద్యంపై ఏదైనా నిరసన చేయాలనుకుంటే.. మెడలో సారా ప్యాకెట్లు వేసుకుంటారా? దీనికి ఆయనే సమాధానం చెప్పాలి.
వాస్తవం చెప్పాలంటే చంద్రబాబుకి ప్రజల సమస్యలపై అవగాహన లేదు, పరిష్కారంపై చిత్తశుద్ధి అంతకంటే లేదు. సమస్యల ముసుగులో తన పార్టీ ప్రచారం, రాజకీయ ప్రయోజనాలు ఇవే బాబుకి కావాల్సింది. సహజ మరణాలని కూడా ఇసుక ఆత్మహత్యలు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు బాబు. ఇక ఆయా కుటుంబాలకు 25లక్షల పరిహారం ఇవ్వాలనేది మరో ప్రహసనం, నెలకు 10వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
దీక్షా స్థలిలో వైసీపీపై సెటైర్లు వేసేలా తయారు చేసిన స్కిట్ లు బాబుకి సైతం తలనొప్పి తెప్పించాయి. అందుకే స్కిట్ల మధ్యలోనే చప్పట్లు కొట్టేసి వేరేవాళ్లకి మాట్లాడే అవకాశం కల్పించారు చంద్రబాబు. ఇంతా చేసీ చంద్రబాబు ఈ దీక్షతో సాధించిందేంటి? కేవలం రాజకీయ డ్రామా కాక చంద్రబాబు అండ్ కో చేసిందేంటి? చంద్రబాబు ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరిగి దీక్ష అట్టర్ ఫ్లాప్ కావడంతో టీడీపీ శిబిరంలో చివరకు నిరాశే మిగిలింది. బాబు దొంగ దీక్షకు అనుకూల మీడియాలో మైలేజీ మాత్రం బాగా దక్కింది.