సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవ్వరూ అక్క, తమ్ముడు, అన్నయ్య అనే వరసలు పెట్టుకొని పిలవరు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాదు కూడా. కానీ సందీప్ కిషన్ మాత్రం తన సినిమాలో నటించిన వరలక్ష్మిని అక్క అని పిలుస్తానంటున్నాడు. తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగులో నేరుగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ను అక్క అని పిలుస్తాడట ఈ హీరో.
“వరలక్ష్మి నాకు చాలా మంచి ఫ్రెండ్. నేను తనను అక్క అని పిలుస్తాను. బయట చెబితే చంపేస్తుంది. ఎందుకంటే ఆమె నాకంటే పెద్దదేం కాదు. చూడ్డానికి మాత్రం అలా కనిపిస్తుంది. అక్క కనిపించగానే కాళ్ల మీద పడిపోయి ఓ దండం పెట్టేసి షూటింగ్ కు తీసుకెళ్తాను. మా ఇద్దరి మధ్య అంత క్లోజ్ నెస్ ఉంది. నేను చాలామందితో క్లోజ్ గా ఉంటాను. కానీ వరలక్ష్మితో ఇంకాస్త ఎక్కువగా ఉంటాను. అందుకే ఆమెను ఎక్కువగా ఏడిపిస్తుంటాను.”
అటు సినిమాలో హీరోయిన్ గా నటించిన హన్సికపై కూడా స్పందించాడు సందీప్ కిషన్. ఫస్ట్ టైమ్ హన్సికతో కలిసి నటించిన ఈ హీరో, ఆమె చాలా సెన్సిటివ్ అంటున్నాడు. తను హీరోయిన్లు అందరితో క్లోజ్ గా ఉంటానని, హన్సికతో మాత్రం అంత క్లోజ్ అవ్వలేకపోయానని, దానికి ఇంకాస్త టైమ్ పడుతుందని చెబుతున్నాడు. కానీ హన్సిక మాత్రం చాలా మంచి అమ్మాయి అంటున్నాడు.
“హన్సికతో నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ నా కెరీర్ స్టార్టింగ్ లో ఓ యంగ్ హీరోయిన్ హన్సికలా ఉండేది. తనకు కూడా అదే ఫీలింగ్. చాలా పోజులు కొట్టేది. ఆమెను చూసినప్పుడు నాకు ఒకటే అనిపించేది. ఈ అమ్మాయే ఇలా ఉందంటే, ఇక హన్సిక ఇంకెలా ఉంటుందో అని భయపడేవాడ్ని. కానీ హన్సికను కలిసిన తర్వాత నావన్నీ భ్రమలని తేలిపోయాయి. హన్సికది చాలా మంచి మనసు.”
గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో హన్సిక-సందీప్ కిషన్ జాయింట్ గా మాట్లాడారు. ముందుగా హన్సిక యాంకర్ గా మారి సందీప్ ను ఇంటర్వ్యూ చేస్తే.. ఆ తర్వాత సందీప్ కూడా యాంకర్ గా మారి హన్సికను ఇంటర్వ్యూ చేశాడు. గమ్మత్తుగా సాగిన ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు వెల్లడించారు ఈ హీరోహీరోయిన్లు.