ఈరోజు పొద్దున్నే కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి ప్లాస్మా డొనేట్ చేశాడు కీరవాణి. ఈయనతో పాటు తనయుడు కాలభైరవ కూడా ప్లాస్మా డొనేట్ చేశాడు. ప్లాస్మా దానం చేసిన విషయాన్ని తండ్రికొడుకులిద్దరూ ఫొటోలతో పాటు సోషల్ మీడియాలో ప్రకటించారు. తమలానే అందరూ ప్లాస్మా దానం చేయాలని, కరోనా బాధితుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, కీరవాణి ఫొటోలు పెట్టిన వెంటనే అంతా రాజమౌళిని ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే.. కోలుకున్న వెంటనే ప్లాస్మా దానం చేస్తానని రాజమౌళి స్వయంగా ప్రకటించాడు. పైగా హైదరాబాద్ పోలీస్ తో కలిసి ప్లాస్మా డొనేషన్ క్యాంప్/ప్రెస్ మీట్ కూడా నిర్వహించాడు. కాబట్టి మీరు ఎప్పుడు ప్లాస్మా డొనేట్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో అంతా రాజమౌళిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
దీంతో రాజమౌళి మరోసారి తన ప్లాస్మా డొనేషన్ పై క్లారిటీ ఇచ్చాడు. పెద్దన్న (కీరవాణి), భైరవకు తొందరగా యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయని, కాబట్టి వాళ్లు ఈరోజు ప్లాస్మా డొనేట్ చేశారని చెప్పుకొచ్చాడు రాజమౌళి. తన శరీరంలో యాంటీబాడీస్ (IgG) కౌంట్ 8.62గా మాత్రమే ఉందని, ప్లాస్మా డొనేట్ చేయాలంటే యాంటీబాడీస్ స్థాయి కనీసం 15గా ఉండాలని చెప్పుకొచ్చాడు.
శరీరంలో వృద్ధి చెందిన యాంటీబాడీస్ కొద్దిరోజులు మాత్రమే ఉంటాయని చెప్పిన రాజమౌళి.. కరోనా నుంచి కోలుకున్న వాళ్లంతా ప్లాస్మా డొనేట్ చేయాల్సిందింగా మరోసారి విజ్ఞప్తిచేశాడు.