జాతీయ మీడియాలో.. ప్రత్యేకించి టైమ్స్ గ్రూప్ మీడియా వర్గాలు రియా చక్రబర్తి గురించి అత్యంత అతిగా ఆవేశపడిపోతుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉదయం లేస్తే టైమ్స్ గ్రూప్ వర్గాలు రియా చక్రబర్తి..రియా చక్రబర్తి.. అంటూ విరుచుకుపడుతున్నాయి. ఆమె అబద్ధాలు చెబుతోందని టైమ్స్ గ్రూప్ వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆమె నిజాలు చెబుతోందా, అబద్ధాలు చెబుతోందా.. అనేది కూడా టైమ్స్ యాంకర్లే డిసైడ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆ చర్చలో పాల్గొంటున్న కొంతమంది ప్రముఖులు… ఎంతసేపు రియా గురించినేనా, పతానవస్థకు చేరిన జీడీపీ గురించి చర్చించండి అంటూ మాట్లాడగా, టైమ్స్ నౌ యాంకర్లు తీవ్రంగా స్పందించారు. వాళ్లెంత పచ్చిగా మాట్లాడారంటే.. తాము రియా గురించి చర్చిస్తాం తప్ప… వేరే కాన్సెప్ట్ ను చర్చించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు!
ఒక మహిళా యాంకర్ స్పందిస్తూ.. జీడీపీ గురించి మాట్లాడుకోవాలంటే వేరే చానల్ కు వెళ్లి మాట్లాడుకోవాలని ఒక విశ్లేషకుడికి స్పష్టం చేసింది. తాము రియా గురించి మాత్రమే చర్చించడానికి కూర్చుకున్నట్టుగా, జీడీపీ గురించి చర్చించే ప్రసక్తి లేదని ఆమె తేల్చారు.
ఒక ఇంకో పురుష యాంకర్ అయితే.. జీడీపీ గురించి ప్రస్తావించిన విశ్లేషకుడిని టైమ్ వేస్ట్ చేయొద్దంటూ గద్దించాడు. జీడీపీ గురించి కావాలంటే పేపర్ చూసకోవాలని, తన టైమ్ వేస్ట్ చేయొద్దని తేల్చాడు. జీడీపీ గురించి మాట్లాడటం తన ప్రేక్షకుల టైమ్ వేస్ట్ చేయడం కూడా అని ఆ యాంకరోత్తముడు తేల్చి చెప్పాడు!
ఈ విషయంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. టైమ్స్ నౌ వీడియాలోను షేర్ చేస్తూ.. జీడీపీ గురించి మాట్లాడటం వీళ్ల దృష్టిలో టైమ్ వేస్ట్ అయ్యిందని, రియా చక్రబర్తి మాత్రం జాతీయ సమస్యగా మారిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ పోస్టు చేస్తున్నారు.