విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పని చేసిన డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ కొండను తవ్వి కనీసం ఎలుకను పట్టుకోలేక పోయింది. డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఈ కేసు కొలిక్కి రావాలంటే మరింత సమగ్రంగా దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. దీంతో హైకోర్టు స్పందిస్తూ మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మరో రెండు నెలల గడువు ఇచ్చింది. నవంబర్ 11న నివేదిక అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ వైద్యులకు పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ గుండు కొట్టించుకుని, ఎవరూ గుర్తించలేని విధంగా విశాఖ నగరంలో నడిరోడ్డుపై ప్రత్యక్షమయ్యాడు. నానా హంగామా సృష్టించాడు. పోలీసులు అతని చేతులను వెనక్కి విడిచి అరెస్ట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.
దీంతో డాక్టర్ సుధాకర్‌పై జరిగిన దాడికి సంబంధించి సీబీఐ విచారణకు ఈ ఏడాది మే 22న హైకోర్టు ఆదేశించింది. ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణమో, మరే ఇతర అంశాల వల్లో తెలియదు కానీ, మరో నాలుగు వారాల గడువు ఎక్కువగా తీసుకుని హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది. తీరా నివేదిక చూస్తే కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యపరుస్తోంది.
సీబీఐ 12 వారాల్లో చేసిందేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుట్రలేంటో తేల్చాలనే కదా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మరి కేవలం అనుమానాలు వ్యక్తం చేయడం, మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందని చెప్పడం చూస్తే…మరి ఇంత వరకు చేసిన దర్యాప్తులో తేలిందేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో 8 వారాలు గడువు తీసుకునైనా కనీసం ఎలుకనైనా పట్టుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.