విశాఖ జిల్లాలో ఒక దళిత యువకుడికి జరిగిన శిరోముండనం కేసులో పోలీసులకు ఎన్నో నూతన విషయాలు తెలుస్తున్నాయట. బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇల్లు, ఆస్తులు, దర్జా, ఇవన్నీ కూడా పోలీసులకు విస్తుబోయేలా ఉన్నాయని అంటున్నారు.
నూతన్ నాయుడు ఏం చేస్తాడు, ఇంత ఆస్తి ఎలా వచ్చింది అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా భోగట్టా. ఇక ఆయన ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చడంపైనా పోలీసులు ద్రుష్టి పెట్టారట. అదేవిధంగా లక్ష రూపాయలు విలువ చేసే ఫోన్ పోయినపుడు పోలీసులకు మొదట ఫిర్యాదు చేయకుండా తామే ఎందుకు స్వయంగా శిక్ష అమలు చేశారన్న దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారని టాక్.
ఇక ఇంత వివాదానికి మూలకారణమైన ఆ ఫోన్ లో ఉన్న అంత విలువైన సమాచారం ఏంటి అన్నది కూడా కూపీ లాగుతున్నారట. ఇవన్నీ పక్కన పెడితే ఈ శిరోముండనం కేసులో నూతన్ నాయుడు భార్య సహా ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇపుడు మరో కొత్త సమాచారం కూడా పోలీసులు కనుగొన్నారట. శిరోముండనం చేసిన ఫోటోలను కూడా చాలా మందికి షేర్ చేసినట్లుగా గుర్తించారట.
ఇలా ఎవరెవరికి ఈ సమాచారం పంపారు, ఎందుకు పంపారు దాని వెనక కారణాలు ఏంటి అన్నది కూడా ఆరా తీస్తున్నారట. మొత్తానికి నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన శిరోముండనం కేసులో దర్యాప్తు మాత్రం లోతుగానే సాగుతోందిట. ఫోన్లు నిందితుల నుంచి స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఆ నివేదిక వచ్చాక మరిన్ని సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.