రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని, త్వరలో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకుంటారని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. మా మొదటి టార్గెట్ టీడీపీయే అంటూ గతంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఈ చేరికలుంటాయని కూడా గుసగుసలు వినిపించాయి.
ఉత్తరాంధ్ర నుంచి గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఈ లిస్ట్ లో ప్రముఖంగా వినిపించింది.అదే జరిగితే బీజేపీ తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్టు అవుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబు సూచనతోనే వారు పార్టీ మారారనే వార్తలు వినిపించినా.. బీజేపీ వాళ్లు మాత్రం అబ్బే అదేంలేదు.. వారి జెండా మారింది, అజెండా కూడా మారిందని సర్ది చెప్పుకున్నారు. కానీ ఆ నలుగురు కేవలం జెండా మాత్రమే మార్చారు. అజెండా మాత్రం బాబుదే అమలు చేశారు.
అమరావతికి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా పదే పదే సుజనా చౌదరి మాట్లాడ్డం వెనక ఆంతర్యం చంద్రబాబు ట్రైనింగ్ కాక ఇంకేంటి?ఇటీవల రాష్ట్రంలో బీజేపీ నాయకత్వంలో మార్పులొచ్చాక సుజనా నోటికి తాళం పడింది. లేకపోతే ఇంకా చంద్రబాబుకి తాళం వేస్తూ ఉండేవారు. ఇప్పుడిక రాష్ట్ర నాయకత్వం వంతు వచ్చింది.
టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే అధికారికంగా కండువా మార్చాలంటే రాజీనామా చేయాల్సిందేననే కండిషన్ పెట్టారు సీఎం జగన్. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వారికి బీజేపీయే ఏకైక ఆప్షన్. టీడీపీని హస్తగతం చేసుకుంటామంటూ వీర్రాజు ఉవ్విళ్లూరుతున్నారు కాబట్టి.. కొంతమందినైనా తమవైపు చేర్చుకుని అసెంబ్లీలో కమలానికి చోటు కల్పించాలని అధిష్టానంతో సహా రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తున్నట్టు వార్తలొచ్చాయి.
అదే జరిగితే బీజేపీ బలపడటం అటుంచి, మరింత అప్రతిష్ట మూటగట్టుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు, ఓ ఎమ్మెల్సీ కేవలం కేసుల భయంతోనే బీజేపీలో చేరారనే అపవాదు ఉంది. సొంతబలం కాకుండా బైటనుంచి వచ్చే అవినీతి పరుల్ని చేర్చుకునే పార్టీగా బీజేపీకి రాష్ట్రంలో ఆల్రెడీ ముద్ర పడిపోయింది.
ఇలాంటి సమయంలో వైసీపీలోకి ప్రయత్నాలు చేసి, చివరకు ఎటూ పాలుపోక బీజేపీలో చేరదామనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలకు కాషాయదళం రెడ్ కార్పెట్ పరుస్తుందా? లేక వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టపరుచుకునేందుకు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటుందా? వేచి చూడాలి.
టీడీపీ ఎమ్మెల్యేలు కావాలంటే గాలం కూడా వేయక్కర్లేదు, అలాంటివారితో బీజేపీకి కూడా ఉపయోగం లేదు. ఏదేమైనా బీజేపీ రెండోసారి ఆ తప్పు చేయకూడదని కమలదళంలో పుట్టిపెరిగిన జాతీయ నేతల అభిప్రాయం.